అమృత‌ను అసెంబ్లీకి పంపుతారట‌!

Update: 2018-09-19 05:14 GMT
మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. త‌మ కంటే త‌క్కువ కులం ఉన్న వాడిని త‌న కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకోవ‌టాన్ని జీర్ణించుకోలేక‌.. అత‌డ్ని కిరాయి హంత‌కుల చేత చంపించిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. త‌న తండ్రి అనాగ‌రిక చ‌ర్య‌తో ప్రేమించి పెళ్లాడిన భ‌ర్త‌ను కోల్పోయి శోక సంద్రంలో మునిగిన అమృత‌ను ప‌లువురు ద‌ళిత నేత‌లు.. క‌మ్యూనిస్ట్ నాయ‌కులు ప‌రామ‌ర్శిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ చేయ‌ని ఆస‌క్తిక‌ర ప్రక‌ట‌న‌ను చేశారు టీ మాస్ ఛైర్మ‌న్ కంచె ఐల‌య్య‌. ప్ర‌ణ‌య్ ఇంటికి వ‌చ్చిన ఆయ‌న‌.. అమృత‌ను.. ప్ర‌ణ‌య్ త‌ల్లిదండ్రుల్ని ప‌రామ‌ర్శించారు. కుల దురంహ‌కారానికి ప్ర‌ణ‌య్ బ‌ల‌య్యాడ‌ని.. ఈ హ‌త్య‌కు బాధ్యులైన వారిని శిక్షించాల‌ని డిమాండ్ చేయ‌టంతోపాటు.. అమృత‌ను చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌న్న స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర మీద‌కు తెచ్చాడు.

అమృత‌ను అసెంబ్లీ అభ్య‌ర్థిగా డిసైడ్‌చేస్తే.. సీపీఎం.. బీఎల్ ఎఫ్.. త‌ర‌ఫున మిర్యాలగూడ అసెంబ్లీ నుంచి ఆమెను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌టానికి తాము సిద్దంగా ఉన్న‌ట్లు చెప్పారు. ఇందుకు టీఆర్ ఎస్ పార్టీ కూడా స‌హ‌క‌రించాల‌ని ఐల‌య్య‌.. క‌మ్యునిస్ట్ నేత‌లు కోరుతున్నారు.

ప్ర‌ణ‌య్ హ‌త్య లాంటి పెద్ద సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత ఈ ఉదంతంపై ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌నీసం ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేద‌ని.. తాజా మాజీ రాష్ట్ర హోం మంత్రి నాయిని కానీ.. జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కానీ ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌టాన్ని వారు త‌ప్పు ప‌ట్టారు.

ఈ హ‌త్య‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లుగా జానారెడ్డి ప్ర‌క‌టించార‌ని... కానీ టీఆర్ ఎస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే.. న‌కిరేక‌ల్ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన వీరేశంపై మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. కులాంత‌ర వివాహాలు చేసుకున్న వారికి ప్ర‌త్యేక ర‌క్ష‌ణ‌కు చ‌ట్టాన్ని తీసుకురావాల్సి ఉందంటున్నారు. ప్ర‌ణ‌య్ హ‌త్య ఉదంతం ఇప్ప‌టికే బోలెడంత రాజ‌కీయ రంగు పులుముకుంద‌న్న మాట వినిపిస్తున్న వేళ‌.. తాజాగా ప్ర‌ణ‌య్ స‌తీమ‌ణి అమృత‌ను అసెంబ్లీకి పంపాల‌న్న మాట ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ‌కు తెర తీసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News