అధ్యక్షా.. మీరు కాస్త ప్రాక్టీస్ చేయాలి

Update: 2019-06-13 13:47 GMT
ఏపీ స్పీక‌ర్ గా త‌మ్మినేని సీతారామ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. మూడుసార్లు మంత్రిగా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని ఎవ‌రూ వేలెత్తి చూపించ‌లేరు. సీనియ‌ర్ నేత‌గా ఆయ‌న‌కున్న అనుభ‌వం కూడా ఎక్కువ‌. అయితే.. రాజ‌కీయ‌ నాయకుడు స‌భాప‌తి స్థానంలో కూర్చున్నంత‌నే మొత్తంగా మారిపోవాల్సి ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కూ అలవాటు లేని పాత్ర‌ను పోషించ‌టం కాస్త క‌ష్ట‌మైన ప‌ని.

అందులోకి త‌మ్మినేని లాంటి వారికి మ‌రింత ఇబ్బంది కూడా. ఎందుకంటే.. త‌మ్మినేని కాస్త ఆగ్రెసివ్ గా ఉంటారు. శాంత స్వ‌భావి కాదు. అలాంటి నేత‌.. స్పీక‌ర్ లాంటి కుర్చీలో కూర్చోవ‌టం కాస్త క‌ష్ట‌మే. అయితే.. అదేమీ అసాధ్యం కాదు. స‌భాప‌తిగా కుర్చీలో కూర్చున్న త‌మ్మినేని త‌న తొలిరోజు ఆయ‌న త‌డ‌బాటు స్ప‌ష్టంగా క‌నిపించింది.

ప‌లు సంద‌ర్భాల్లో స‌భ‌ను కంట్రోల్ చేయ‌టానికి.. స‌భ్యులకు స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నంలో ఆయ‌న‌.. ఏయ్.. అయ్.. అంటూ మాట్లాడిన మాట‌లు కాస్త చిత్రంగా..కొత్త‌గా ఉన్నాయ‌ని చెప్పాలి. ఇలాంటి ప‌దాలు స్పీక‌ర్ స్థానంలో కూర్చున్న వారి నోటి నుంచి రావ‌టం అంత‌గా బాగుండ‌దు. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ అయిన త‌మ్మినేని అర్థం చేసుకోవాలి.

మిగిలిన స్థానాల‌కు.. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన స్థానంలో ఉన్నప్పుడు కొన్ని అంశాల్ని త‌ప్ప‌నిసరిగా పాటించాలి. ఈ కోణంలో చూసిన‌ప్పుడు త‌మ్మినేని త‌న‌ను తాను వీలైనంత త్వ‌ర‌గా మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది. స్పీక‌ర్ ఎలా ఉంటార‌న్న మాట‌ల్ని త‌మ్మినేనికి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎంతోమంది స్పీక‌ర్ల‌ను చూసిన ఆయ‌న‌.. త‌న‌ను తాను స్పీక‌ర్ స్థానంలో ఊహించుకుంటూ ఆయ‌న కాస్తంత ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అధ్యక్షుల వారిని త‌ప్పు ప‌ట్ట‌టం కాదు..ఆయ‌న మ‌రింత మెరుగ్గా వ్య‌వ‌హ‌రించాల‌న్నదే ఉద్దేశం త‌ప్పించి మ‌రే ఉద్దేశం లేద‌న్నది గుర్తిస్తార‌ని భావిస్తున్నాం.


Tags:    

Similar News