మాజీ ఎంపీపై క‌క్ష క‌ట్టిన కేసీఆర్‌

Update: 2016-12-15 05:32 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆస‌క్తిక‌ర‌మైన విమ‌ర్శ చేశారు. కేసీఆర్ తీరు చూస్తుంటే త‌న‌పైన, త‌మ‌ పార్టీపైనా కక్ష ప‌ట్టినట్టుగా భావించిన‌ట్లుగా ఉంద‌ని వాపోయారు. సీపీఎం ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రకు ప్రభుత్వం వైపు నుంచి కనీస సహకారం లేకపోవటమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రపట్ల - మాజీ ఎంపీ- ఎమ్మెల్యేగా ప‌నిచేసి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తన పట్లా ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించటం సరికాదని వాపోయారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు తమ్మినేని లేఖ రాశారు.

త‌మ్మినేని ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న‌ పాదయాత్రలో పాల్గొన్న బృందాన్ని ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ ప్రాంతంలో లారీ ఢీకొన‌డంతో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. ఈ క్ర‌మంలో పాదయాత్రకు భ‌ద్ర‌త‌పై సందేహాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో త‌మ్మినేని సీఎం కేసీఆర్‌ కు లేఖ రాశారు. యాత్ర‌ ప్రారంభానికి ముందే అనుమతులు తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ..యాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ ను కూడా పోలీసులకు అందించామని త‌మ్మినేని వివరించారు. అయినప్పటికీ పోలీసులు ఎక్కడా తమకు బందోబస్తు కల్పించలేదని వాపోయారు. రెండేళ్ల‌ క్రితమే తనకు ప్రభుత్వం భద్రత కల్పించిందని, అయితే పాదయాత్ర గురించి ప్రకటించగానే భద్రతను ఉప సంహరించిందని తెలిపారు. దీంతో తనకు మళ్లీ గన్‌మెన్లను కేటాయించాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశానని, అయితే అది ఇప్పటికీ పెండింగ్‌ లోనే ఉందని త‌మ్మినేని  తెలిపారు.

రాష్ట్రంలోని వివిధ అటవీ ప్రాంతాలు - సమస్యాత్మక ప్రదేశాల్లో సైతం తనతో పాటు పాదయాత్ర బృందం పర్యటిస్తోందని త‌మ్మినేని వివరించారు. ఈ నేపథ్యంలో భద్రత కోరుతూ తాను రాసిన లేఖను పెండింగ్‌లో పెట్టటమేంటని ప్రశ్నించారు. ఈ అంశంపై అంగీకారం తెలపటమో లేక తిరస్కరించడమో చేయాలి కదా? అని ప్రశ్నించారు. దీనిపై అధికారులను అడిగితే...వారి నుంచి 'మీకు తెలియందేముంది...?' అనే సమాధానం వచ్చిందని విమర్శించారు. పాదయాత్రను అడ్డుకోవాలంటూ స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటన చేసిన నేపథ్యంలో పాదయాత్రపై సీఎం కక్షపూనారని భావించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా తనకు, పాదయాత్ర బృందానికి తగిన భద్రత కల్పించాలని తమ్మినేని కోరారు. ఇందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News