టార్గెట్ 2024: మీడియా రంగంలోకి అదానీ!

Update: 2021-09-19 15:59 GMT
మీరు చ‌దివింది నిజ‌మే! ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర వ్యాపారాలు.. పోర్టు వ్య‌వ‌హారాల‌కే ప‌రిమిత‌మైన అదానీ గ్రూప్ త్వ‌ర‌లోనే  మీడియారంగంలోకి కూడా అడుగు పెట్ట‌బోతోంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు..(2024) ల‌క్ష్యంగా అదానీ గ్రూప్ మీడియా వైపు దృష్టి పెట్టింది. అయితే.. దీని వెనుక బీజేపీ కీల‌క నేత‌లు.. ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కాలంటే.. మీడియా ద‌న్ను చాలా అవ‌స‌రం.. ఈ నేప‌థ్యంలో `త‌న‌వారికి` మీడియాలో ప్రాబ‌ల్యం పెర‌గ‌డం.. ఇప్పుడు బీజేపీకి ఉన్న కీల‌క అంశం. ఈ నేప‌థ్యంలో బీజేపీకి అత్యంత విధేయులు.. మ‌రీ ముఖ్యంగా కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న వారికి అత్యంత విశ్వ‌స‌నీయులుగా పేరున్న అదానీ వంటివారు మీడియావైపు  దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది.

విష‌యంలోకి వ‌ళ్తే.. ఇటీవ‌ల కాలంలో మీడియా రంగంలో కార్పొరేట్ పెట్టుబడులు పెరిగిపోయాయి. మీడియా ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా, రాజ‌కీయ ద‌న్నుగా మారిపోయిన ద‌రిమిలా.. దీనిపై కార్పొరేట్ వ‌ర్గాలు కూడా క‌న్నేశాయ‌నేది.. ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట‌. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల కింద‌ట‌.. దిగ్గ‌జ సంస్థ రిల‌య‌న్స్ కూడా మీడియా రంగంలోకి ప్ర‌వేశించింది. అయితే.. కొత్త‌గా ఎలాంటి ఛానెళ్లు ప్రారంభించ‌కుండా.. అప్ప‌టికే ఉన్న 18 న్యూస్‌ను సొంతం చేసుకుని.. త‌న మీడియా ప్ర‌భావం చూపుతోంది. ఇప్పుడు ఇదే పంథాలో అదానీ కూడా ప‌య‌నించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఇప్ప‌టికే.. దీనికి సంబంధించి కీల‌క నియామ‌కాలు కూడా చేప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

అదానీ గ్రూప్ త్వ‌ర‌లోనే మీడియా రంగంలో అడుగుపెడుతోంది. ఈ క్ర‌మంలో ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలపైనే దృష్టి పెట్టింది. ప్రింట్ మీడియాకు దూరంగా ఉండబోతోంది. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాల్లో ఇప్పటికిప్పుడు కొత్త ఛానెల్స్, వెబ్ పోర్టల్స్ ఏర్పాటుచేయ‌కుండా.. ఇప్ప‌టికే  మార్కెట్లో ఉన్న పలు ఛానెళ్లు, న్యూస్ పోర్టల్స్ ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతు న్నట్టు తెలుస్తోంది. గతంలో రిలయన్స్ గ్రూప్ కూడా ఇదే పనిచేసింది. మీడియాలో అడుగుపెడుతూనే నెట్ వర్క్ 18ను దక్కించుకుంది. అటు అంతర్జాతీయంగా చూసుకుంటే అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, వాషింగ్టన్ పోస్ట్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

హిందీతో పాటు ఒకేసారి దక్షిణాది భాషల్లో న్యూస్ ఛానెల్స్, వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ ఏర్పాటుచేసే దిశగా అదానీ గ్రూప్ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ఆల్రెడీ మనుగడలో ఉన్న ఛానెల్స్, వెబ్ సైట్స్ పై దృష్టి సారించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా మీడియాలో ప‌ట్టు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. అదానీ మీడియా సంస్థ‌కు.. క్వింట్ మాజీ అధ్యక్షుడు సంజయ్ పుగాలియాను సీఈవో అండ్ ఎడిటర్-ఇన్-చీఫ్ గా నియమించిన‌ట్టు తెలిసింది. సంజయ్ కు మీడియా రంగంలో 4 దశాబ్దాల అనుభవం ఉండ‌డం గ‌మ‌నార్హం.

దాదాపు అన్ని ప్రముఖ సంస్థల్లో సంజ‌య్ పనిచేశారు. సీఎన్బీసీ, జీ-మీడియా, స్టార్ న్యూస్, ఆజ్ తక్, బిజినెస్ స్టాండర్డ్, నవభారత్ టైమ్స్, బీబీసీ.. ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసిన అనుభవం సంజయ్ కు ఉంది. మరీ ముఖ్యంగా కొత్త మీడియా సంస్థల ఏర్పాటులో ఈయన అనుభవం అపారమ‌ని మీడియా వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఇప్పుడు ఈ అనుభవమే, సంజయ్ కు అదానీ గ్రూప్ లో స్థానం కల్పించింది. త్వరలోనే అదానీ మీడియా సంస్థల్ని సంజయ్ ప్రకటించబోతున్నారు. మొత్తంగా చూస్తే.. త్వ‌ర‌లోనే ``మీరు చూస్తున్నది అదానీ టీవీ`` అనే మాట వినిపించ‌నుంద‌న్న‌మాట‌!!
Tags:    

Similar News