టార్గెట్ బెంగాల్‌: బీజేపీకి సాధ్య‌మేనా?

Update: 2020-12-21 01:30 GMT
బీజేపీ జాతీయ స్థాయి నేత‌ల‌ను ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. త‌మ టార్గెట్ ప‌శ్చిమ బెంగాల్ అంటున్నారు. అంతేకాదు.. ఎట్టి ప‌రిస్థితి లోనూ ఇక్క‌డ అదికారంలోకి వ‌చ్చి తీరుతామ‌ని కూడా చెబుతున్నారు. ఇక‌, తాజాగా పార్టీ కీల‌క నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మ‌రో నాలుగు అడుగులు ముందుకు వేసి.. ఏకంగా 200 స్థానాల్లో గెలిచి చ‌రిత్ర సృష్టిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. అంతేకాదు.. బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ సార‌థి.. మ‌మ‌తా బెన‌ర్జీని ఉద్దేశించి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లే చేశారు. ``ఇది ప్రారంభం మాత్ర‌మే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మేం 200 సీట్లు గెలిచి తీరుతాం. అప్ప‌టికి నీ పార్టీలో నువ్వు ఒక్క‌దానివే మిగులుతావు`` అని ఘాటుగానే కామెంట్లు చేశారు.

ఇక‌, షా చేసిన ఈ కామెంట్ల‌ను వినేందుకు.. ఆహా.. ఓహో.. అని పొగిడేందుకు బీజేపీ నేత‌ల‌కు బాగానే ఉంటుంది. అదేస‌మ‌యం లో బీజేపీ సానుభూతి ప‌రుల‌కు కూడా ఈ వ్యాఖ్య‌లు, ల‌క్ష్యాలు ఆనందం ఇస్తే.. ఇచ్చి ఉండొచ్చు. మ‌రి వాస్త‌వం ఏంటి? స్థానిక ప‌రిస్థితుల‌కు.. బీజేపీ నేత‌లు చేస్తున్న హ‌డావుడికి తేడా ఉందా? అంటే.. ఖ‌చ్చితంగా ఉంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. బెంగా ల్లో సుదీర్థ పాల‌న సాగించిన క‌మ్యూనిస్టుల‌ను తోసిరాజ‌ని.. అధికారం చేప‌ట్టిన మ‌మ‌తా బెన‌ర్జీ త‌న‌దైన దూకుడు ప్ర‌ద‌ర్శించి.. వ‌రుస‌గా రెండో సారి కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. దాదాపు ప‌దేళ్లుగా బెంగాల్‌లో అధికార చ‌క్రం తిప్పుతున్నారు. అయితే, కొన్ని లోపాలు ఉన్నాయ‌నేది వాస్త‌వం.

ప్ర‌ధానంగా శార‌దా చిట్ ఫండ్ కుంభ‌కోణం.. దీదీకి ఇబ్బందిగానే ఉంది. ఈ విష‌యంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నారు. అయితే.. ఇత‌ర రంగాల్లో మాత్రం ఎక్క‌డా అవినీతి లేక పోవ‌డంతోపాటు.. ప్ర‌భుత్వం క్లీన్‌గా ఉండ‌డం, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం ఇస్తుండ‌డం దీదీకి బ‌ల‌మైన రాజ‌కీయం ఏర్ప‌డేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ముఖ్యంగా అట్ట‌డుగు వ‌ర్గాల్లో దీదీ(అక్క‌) ప‌ట్ల ఇప్ప‌టికీ సానుబూతి ఉంది. ఆమె వ్య‌వ‌హార శైలితో పాటు డౌన్‌టు ఎర్త్ అనే విధానం.. ప్ర‌జ‌ల్లో స్థిర‌మైన ఓటు బ్యాంకును క‌ల్పించింది. ఈ త‌ర‌హా ఓటు బ్యాంకు బీజేపీ ఏర్పాటు చేసుకోలేక పోయింది.

పైగా కేంద్రం చేసిన జాతీయ పౌర ప‌ట్టిక పై ఇప్ప‌టికీ ఆగ్ర‌హ జ్వాల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. దీంతో బీజేపీ ఇప్పుడు పెట్టుకున్న ల‌క్ష్యం(200 సీట్లు) సాధించ‌డం అంత ఈజీకాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్టు ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇక‌, పార్టీ ప‌రంగా ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా దీదీ దూకుడు చూపించ‌డాన్ని కొంద‌రు సీనియ‌ర్లు స‌హించ‌లేక పోతున్నారే త‌ప్ప‌.. ఆమెపై అవినీతి ఆరోప‌ణ‌లు చేసే సాహ‌సం ఎవ‌రూ చేయ‌లేక పోతున్నారు. ఒక‌టి రెండు చిన్నా చిత‌కా.. విష‌యాల్లో త‌ప్ప‌.. త‌ప్పు ప‌ట్ట‌లేని పాల‌నతో దీదీ దూసుకుపోతున్నార‌నేది వాస్త‌వ‌మ‌ని జాతీయ మీడియాలోనూ వ‌స్తున్న‌ది. కాగా, ఇప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇక్క‌డ పాగా వేయాల‌న్న సంక‌ల్పం వెనుక బీజేపీకి రెండు ల‌క్ష్యాలు ఉన్నాయి. ఒక‌టి రాష్ట్రంలో పాగా వేయ‌డం అయితే.. రాజ‌కీయంగా దీదీకినామ‌రూపాలు లేకుండా చేయ‌డం ద్వారా దేశంలో త‌మ‌ను ఎద‌రించి నిలిచే ప్ర‌త్య‌ర్థి లేకుండా చేసుకోవ‌డం. కానీ.. పైకి చెబుతున్న మాట‌ల‌కు క్షేత్ర‌స్థాయి ప‌రిణామాల‌కు పొంత‌లేని వైనం.. ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మరి ఏం జ‌రుగుతుందో చూడాలి.




Tags:    

Similar News