ఈ చమురు వదిలించండి సారూ..?

Update: 2022-01-17 07:17 GMT
చమురు బాగానే వదులుతోంది అందరికీ. చమట ఎంత చిందించినా కూడా అసలు జరుగుపాటు అయితే లేదు. రెండేళ్ళుగా కరోనా విపరీతంగా  ఉంది. దాని వల్ల అన్ని వ్యవస్థలూ కునారిల్లాయి. దీంతో ఏ రంగం చూసినా నీరసమే వస్తోంది. అదే టైమ్ లో  పన్నుల బాధ కూడా పట్టి పీడిస్తోంది. పాలకులు తమ ఖజానాను నింపుకునేందుకు కొత్త కొత్త పన్నులు వేస్తూంటారు. అలా ఏపీ సర్కార్ హరిత పన్ను అనేదాన్ని  ఒకటి ప్రవేశపెట్టింది.

అది ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలు చేస్తోంది. దీని ప్రకారం మోటార్ టాక్స్ లో మార్పులు కూడా చేసింది. గత నవంబర్ లో మోటార్ టాక్స్ లో గ్రీన్ టాక్స్ ని చేర్చారు. కర్బన ఉద్గారాల నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు గానూ ఈ గ్రీన్ టాక్స్ ని విధిస్తున్నారు. ఈ బిల్లు ప్రకారం ఒక వాహనం రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి ఏడేళ్ళ నుంచి పదేళ్ల లోపు అది రోడ్ల మీద తిరుగుతూంటే దానికి గ్రీన్ టాక్స్ గా ఏడాదికి నాలుగు వేల రూపాయలు చెల్లించాలి.

అదే పది నుంచి పన్నెండేళ్ళు ఆ వాహనం వయసు ఉంటే అయిదు వేల రూపాయలు. 12 ఏళ్ళు దాటితే ఆరు వేల రూపాయలు గ్రీన్ టాక్స్ కింద చెల్లించాలి. అంటే  ఒక విధంగా రవాణా రంగానికి ఇది గుదిబండ లాంటి టాక్స్ అన్న మాట. అసలే కరోనాతో అన్ని ధరలూ పెరిగి పులుసు కారిపోతోంది. దాంతో కొత్తగా ఈ చమురేంటి అని లారీ యజమానులు గుస్సా అవుతున్నారు.

మేము గ్రీన్ టాక్స్ పేరిట పన్నులు కట్టలేం సామీ అనేస్తున్నారు. తమకు ఈ చమురు గలీజు  అంటించవద్దు అని కూడా మొర పెట్టుకుంటున్నారు. ఈ మేరకు లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ కి తాజాగా  లేఖ రాశారు.  తక్షణం గ్రీన్ టాక్స్ వసూల్ ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అంతే కాదు ఇందన ధరలు విపరీతంగా పెరిగాయని, అందువల్ల రాష్ట్రంలో వ్యాట్ టాక్స్ ని బాగా తగ్గించాలని, రహదారులను కూడా వెంటనే రిపేర్లు చేయించాలని కోరారు. కరోనా వల్ల రవాణా రంగం ఆర్ధిక సంక్షోభంలో ఉందని, తమకు రోజు వారీ ఖర్చులు కూడా ఇబ్బందిగా మారుతున్నాయని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రవాణా రంగం సమస్యల మీద సర్కార్ స్పందిస్తుందా. చూడాలి.
Tags:    

Similar News