ఏపీలో అపుడే లెక్క‌లేసుకుంటున్న కాంగ్రెస్‌

Update: 2018-11-14 15:30 GMT
ఎన‌క‌టికి ఎవ‌డో ఆలూలేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనుకున్న‌ట్టు... తెలంగాణ‌లో టీడీపీ-కాంగ్ పొత్తు ఇంకా నిన్నా ఈరోజు తేలింది. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న కూడా పూర్త‌వ‌లేదు. అపుడే ఏపీలో పొత్తు పొడ‌వ‌క‌నే సీట్ల పంప‌కంపై చ‌ర్చ‌లు సాగుతున్నాయి రెండు పార్టీల కేడ‌ర్ మ‌ధ్య‌న‌. నాయ‌కులు కంటే టీడీపీ కేడ‌ర్ దీనిపై అత్యుత్సాహం చూపుతోంది. ఏఏ సీట్లు కాంగ్రెస్ తీసుకుంటుందో ఏపీ జ‌నాల్లో డిస్క‌ష‌న్ దాకా వెళ్లింది.

ఏపీ పీసీసీ అధ్య‌క్షుడితోనే పంప‌కం మొద‌లైంది. కాంగ్రెస్ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి గ‌తంలో అనంత‌పురం జిల్లా క‌ళ్యాణదుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచారు. అంత‌కుముందు ఆయ‌న‌ది మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న‌ది. పున‌ర్విభ‌జ‌న‌లో ఆ నియోజ‌క‌వ‌ర్గం పోయింది. దీంతో క‌ళ్యాణ‌దుర్గం వచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో పెనుగొండ‌లో పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఈయ‌న‌కు పొత్తులో క‌ళ్యాణ‌దుర్గం గ్యారంటీ అంటున్నారు. అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే హ‌నుమంత‌రాయ చౌద‌రి గ‌త ఎన్నిక‌ల ముందు చాలా బ‌ల‌హీనుడు. పార్టీ గాలిలో గెలిచారు. ఈసారి కేవ‌లం డ‌బ్బు మీద ఆధార‌ప‌డ్డారు గాని ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ లేదు. అయితే, పార్టీకి సానుకూల‌త బాగా ఉంది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ప‌నిచేసిన నియోజ‌క‌వ‌ర్గం కాబ‌ట్టి హ‌నుమంత‌రాయ చౌద‌రి వ‌య‌సు కూడా అయిపోవ‌డంతో ఆ సీటు ర‌ఘువీరారెడ్డికి రావ‌చ్చంటున్నారు.

 ఇక అదే జిల్లాలో శింగనమల టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే యామినీ బాలను తప్పించి మాజీ మంత్రి శైలాజనాథ్‌ కు ఇస్తార‌ట‌. క‌ర్నూలు జిల్లాలో కోట్ల సుజాత‌మ్మ‌కు టిక్కెట్ ఇచ్చే అవ‌కాశాలున్నాయి. ఆమె బ‌ల‌మైన అభ్య‌ర్థి. ఇక గుంటూరు జిల్లాలో  గుంటూరు తూర్పు (మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌ వలీ) - పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఒక సీటు - విశాఖ నుంచి ఒక సీటు కాంగ్రెస్‌కు పొత్తులో ద‌క్కుతాయంటున్నారు. ఓవ‌రాల్‌ గా 175 సీట్ల‌లో కాంగ్రెస్‌ కు 8 సీట్లు టీడీపీ నుంచి ద‌క్కుతాయ‌ట‌. గ‌ట్టిగా పోరాడితే తెలంగాణలో కాంగ్రెస్ ఫ‌ర్‌ ఫామెన్స్ బాగుంటే 12కు పెరిగే అవ‌కాశం ఉంద‌టున్నారు.

అయితే, ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం ఒక‌టుంది. తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలు ఒక‌టి తెలంగాణ‌లో - ఇంకోటి ఆంధ్ర‌లో క‌నుమ‌రుగు అయ్యాయి. అందుకే ఒక‌రి భుజం మీద ఒక‌రు ఓదార్పు పొందుతున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌పోర్టుతో టీడీపీని కాపాడుకున్నుందుకు రుణం తీర్చుకోవ‌డానికి చంద్ర‌బాబు ఏపీలో కొన్ని త్యాగాలు చేస్తారంటున్నారు. మొత్తానికి యు ట‌ర్న్ యు ట‌ర్న్ అని చంద్ర‌బాబు పార్టీకి కూడా యుట‌ర్న్‌లు నేర్పించారు.
Tags:    

Similar News