ఇద్దరు మాజీ మంత్రులూ ఉండాల్సిందే... ?

Update: 2022-05-25 02:30 GMT
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి ఇపుడు కొంత అనుకూలత కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీకి కొత్త రక్తం కావాలని చర్చ వస్తోంది. అధినాయకత్వం సైతం యువతకు ఎక్కువ అవకాశాలు అని ప్రకటిస్తోంది. ఈ నేపధ్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు తమకు చాన్స్ ఉంటుందా ఉండదా అన్న ఆలొచనలో పడుతున్నారు. నిజానికి కొందరు సీనియర్ నాయకులు ఈ రోజుకూ యూత్ కంటే ఎక్కువ దూకుడుతో ఉంటున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో అలా కనుక చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ మీద మూడేళ్ళుగా పోరాడుతున్నారు. ఆయన ఎక్కడా తగ్గడంలేదు. అరెస్ట్ చేస్తారు అని కూడా బెదరడంలేదు. ఆయన తెల్లారి లేస్తే జగన్ మీద మంత్రుల మీద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

ఈ నేపధ్యంలో అయ్యన్నపాత్రుడు వంటి నాయకుడు ఉంటేనే నర్శీపట్నంలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది అని అంటున్నారు. అయితే అయ్యన్న కొడుకు విజయ్ పాత్రుడు కన్ను కూడా ఇదే సీటు మీద ఉంది. దాంతో తండ్రికా కొడుక్కా టికెట్ అన్న చర్చ సాగుతోంది. విజయ్ పాత్రుడుకు లోకేష్ మద్దతు ఉంటే చంద్రబాబు అయ్యన్న చేత మరోమారు పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అయితే అయ్యన్న మాత్రం కుమారుడి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తాను తప్పుకోవడానికి సిద్ధమని అనధికారికంగా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఈసారి ఎన్నికలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా జరుగుతాయి కాబట్టి అయ్యన్న లాంటి వారు ఉండాల్సిందే అన్నది పార్టీ పెద్దల ఆలోచనట.

ఇక విశాఖ జిల్లాలో మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద సొంత పార్టీలోనే కొందరు విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ అధినాయకత్వం మాత్రం అవేమీ పట్టించుకోవడంలేదు అంటున్నారు. ఆయన అంగబలం, అర్ధబలంతో పాటు ఆయనకు ఉన్న వ్యూహాలు పార్టీకి ఎక్కువ సీట్లు తెస్తాయని భావిస్తున్నారుట. అందుకే గంటా విషయంలో స్పెషల్ గా అధినాయకత్వమే అన్నీ చూస్తూ ఆయనను గో ఎ హెడ్ అంటోంది అని చెబుతున్నారు.

అంటే ఇక్కడ స్పష్టం అవుతోంది ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ మాజీ మంత్రులు ఇద్దరూ టీడీపీ తరఫున ముందు భాగాన ఉంటూ విశాఖ జిల్లాలో సైకిల్ పార్టీకి జోరు చేయడానికి తమ పూర్తి శక్తిని ఉపయోగిస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే వారసులకు నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అన్న మాటే వినిపిస్తోంది ఇపుడు.
Tags:    

Similar News