వైసీపీతో టచ్ లోకి టీడీపీ బడా నేతలు... ?

Update: 2021-11-14 09:28 GMT
ఎవరెన్ని చెప్పినా ఏపీలో ఉన్నవి రెండే పార్టీలు, రెండూ బలమైన ప్రాంతీయ పార్టీలే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ. ఈ రెండు పార్టీలను దాటి రాజకీయం చేసే స్థాయి, సత్తువ ఇప్పట్లో అయితే ఎవరికీ లేదు అనే చెప్పాలి. ఈ నేపధ్యంలో అధికార వైసీపీ టీడీపీ అస్థిత్వం మీదనే గురి పెడుతోంది. తమకు పోటీగా సమీప భవిష్యత్తులో ఆ పార్టీ లేకుండా చేయాలన్నదే వైసీపీ అజెండా. ఈ విషయంలో ట్రెడిషనల్ పాలిటిక్స్ ని దాటి మరీ కొన్ని సార్లు వైసీపీ అడ్డగోలుగా  వెళ్తోంది అంటారు. దాని మీద ఎలాంటి కామెంట్స్ వచ్చినా  కూడా వైసీపీ మాత్రం రాజకీయ తెరమీద  టీడీపీని లేకుండా చేయాలన్న ఆలోచనతోనే ముందుకు దూకుడుగా సాగుతోంది అన్న చర్చ కూడా ఉంది.

ఇదిలా ఉంటే 2024 ఎన్నికల తరువాత ఏపీలో టీడీపీ అంతర్ధానం అవడం ఖాయమని ఎంపీ విజయసాయిరెడ్డి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఏపీలో టీడీపీ ఇప్పటికే అన్ని రకాలుగా బలహీనపడిపోయింది అని ఆయన తేల్చేస్తున్నారు. టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కుప్పంలో ఒక  చిన్న మునిసిపాలిటీ గెలవడానికే చమటలు కక్కుతున్నారు అంటేనే ఆ పార్టీ సీన్ అర్ధమైపోతోంది అన్నది సాయిరెడ్డి వాదన. ఇక ఏపీలో ఏ ఎన్నిక జరిగినా వైసీపీకి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోందని కూడా అంటున్నారు. తమకు పోటీగా ఏ పార్టీ లేదు అని కూడా స్పష్టం చేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీ పని అయిపోయిందని చంద్రబాబు సహా అందరికీ తెలుసు అని కూడా సాయిరెడ్డి హాట్ కామెంట్స్ తాజాగా చేశారు. దాంతో టీడీపీలో ఉన్న బడా నాయకులు అంతా వైసీపీకి టచ్ లోకి వస్తున్నారని ఆయన అతి పెద్ద బాంబు పేల్చారు. వైసీపీలోకి వస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని కూడా ఆయన వెల్లడించడం విశేషం. అయితే వారితో చర్చలు జరుగుతున్నాయని ఆన ఆయన అంటున్నారు.  అయితే ఎవరి పేర్లు చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచుతున్నారు. మరి సాయిరెడ్డి చెప్పినట్లుగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్న బడా నాయకులు ఎవరు అన్న దాని మీద పసుపు శిబిరంలోనూ హాట్ హాట్ డిస్కషన్స్ సాగుతున్నాయి. టీడీపీని దెబ్బ తీయడానికి సాయిరెడ్డి ఈ మాటలు అంటున్నారా నిజంగా టీడీపీ నుంచి పెద్ద నాయకులు పార్టీని వీడుతున్నారా అన్న దాని మీద మల్లగుల్లలు పడుతున్నారు.

అయితే సాయిరెడ్డి మాత్రం ఇది పక్కా నిజం. అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు. మరి టీడీపీ తీరు చూస్తే సార్వత్రిక ఎన్నికలు జరిగి మూడేళ్ల కాలం అవుతున్నా కూడా ఇంకా ఎక్కడా గట్టిగా  పుంజుకోలేదు. వరసబెట్టి పలు ఎన్నికల్లో ఓటమి అంటే ఒక విధంగా ఏ పార్టీకైనా నైతిక స్థైర్యం దెబ్బ తినడం ఖాయం. దానికి టీడీపీ కూడా అతీతం కాదు, మరో వైపు చూస్తే వైసీపీ దౌర్జన్యాలు చేసి గెలిచింది అని ఎంత చెప్పుకున్నా గెలుపు గెలుపే కాబట్టి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న నేతల్లో అయితే గుబులు ఉండదు అని ఎవరూ అనలేరు. మరి వారికి చంద్రబాబు ఇచ్చే భరోసా మీదనే ఏదైనా ఆధారపడి ఉంటుంది. లేకపోతే విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా చెప్పినా కూడా ఏదో రోజున టీడీపీ గట్టు దాటి తమ్ముళ్లు బయటకు వచ్చినా వస్తారన్నదే ఒక నిఖార్సైన విశ్లేషణ.
Tags:    

Similar News