జనసేనాధి వెంట తెలుగు తమ్ముళ్లు!

Update: 2019-08-31 04:16 GMT
రాజకీయ పార్టీల మధ్య వైరం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఉప్పు.. నిప్పు మాదిరి చిటపటలు కనిపిస్తుంటాయి. అలాంటిది ఒక పార్టీ అధినేత ఒకచోటకు వస్తే.. దాంతో వైరం ఉన్న మరో పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు కనిపించే ఛాన్స్ ఉండదు. ఇందుకు భిన్నమైన సీన్ తాజాగా అమరావతిలో కనిపించటం గమనార్హం.

ఏపీ రాజధాని అమరావతి మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా రాజధానికి చెందిన పలు గ్రామాల్లో పర్యటించారు. రాజధాని ప్రాంత వాసుల సమస్యలు తెలుసుకునే పేరుతో సాగిన ఈ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం లోని నిడమర్రు.. కురగల్లు.. ఐనవోలు.. ఉప్పలపాడు.. నేలపాడు..రాయపూడి.. అనంతవరం.. దొండపాడు గ్రామాల్లో పవన్ పర్యటన సాగింది. ఏదైనా హాట్ అంశం చోటు చేసుకున్న వేళ.. ఆయా పార్టీల అధినేతలు రావటం.. ప్రజలతో మాట్లాడటం మామూలుగా సాగే ప్రక్రియే.

తాజాగా జరిగిన పవన్ పర్యటన సందర్భంగా కనిపించిన విభిన్నమైన అంశం ఏమంటే.. ఆయన వెంట ఉన్న నేతల్లో పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మోస్తరు నేతలు కనిపించటం ఆశ్చర్యానికి గురి చేసింది. మిత్రుత్వం లేని రెండు పార్టీలు.. అందునా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకరిపై ఒకరు అభ్యర్థుల్ని నిలుపుకొని.. విమర్శలు చేసుకున్న పార్టీలకు చెందిన వారు ఇప్పుడు అందుకు భిన్నంగా పవన్ వెంట ఉండటం దేనికి నిదర్శనమన్న ప్రశ్న తలెత్తుతోంది.

పర్యటనలో భాగంగా జనసేనాధి అక్కడి వారితో మాట్లాడుతూ.. రాజధానిని తరలిస్తామంటే తాము ఒప్పుకోమని చెప్పారు. రాజధాని పేరుతో దోపిడీలకు .. ఆధారాలు ఉంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. మొత్తంగా పవన్ పర్యటన సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పలువురు ఆయన వెంట ఉండటం.. హడావుడి చేయటం స్థానికంగా చర్చనీయాంశంగా మారటమే కాదు.. రెండుపార్టీల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్న దానిపై ఆసక్తికర చర్చ నడిచింది.
Tags:    

Similar News