స‌మైక్యం పేరుతో కొత్త రాజ‌కీయం: వైసీపీపై చంద్ర‌బాబు ఫైర్‌

Update: 2022-12-11 02:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ల్లే రాష్ట్రానికి ఎక్కువ న‌ష్టం జ‌రిగింద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది రాష్ట్ర విభ‌జ‌న కన్నా ఎక్కువ న‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు. స‌మైక్య రాష్ట్రం వ్యాఖ్య‌ల‌తో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తు న్నార‌ని విరుచుకుప‌డ్డారు. తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా  ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీ విభజన చట్టం ప్రకారం  రావాల్సిన నీళ్లు, నిధులపై వైసీపీ నేత‌లు ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరిత‌మేన‌ని చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రాష్ట్ర విభజన జ‌రిగిన తీరుతో న‌ష్ట‌పోయిన దాని కంటే జగన్ పాలన వల్లే ఏపీకి ఎన‌లేని న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పారు.

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. అలాంటి ఘటనలపై దృష్టి పెట్టకుండా మళ్ళీ సమైక్య రాష్ట్రం అంటూ ప్రభుత్వం ప్రకటనలేంటని నిల‌దీశారు.  రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ప‌డుతుంటే వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలవాలి, కలపాలి అంటూ ప్రజలను గందరగోళంలోకి నెడుతూ రాజ‌కీయ  ప‌బ్బం గ‌డుపుకొంటున్నార‌ని బాబు మండిప‌డ్డారు.

ప్రభుత్వ పెద్దలు విభ‌జ‌న స‌య‌మంలో చేసిన‌ తప్పులను సరిదిద్దుకోవాలని చంద్ర‌బాబు హితవుపలికారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే  ప్రకటనలు ఆపి రైతుల ఆత్మహత్యలు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల‌న్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు అన్న‌దాత‌ల‌ను అప్పులపాలు చేస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ప్రభుత్వ టెర్రరిజం తీరుతో ప్రజలపై వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని బాబు మండిపడ్డారు. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News