కమ్మ కేరాఫ్ టీడీపీ...ఇదెక్కడి లాజిక్... ?

Update: 2022-04-21 05:29 GMT
రాజకీయాలు వేరు. కులాలు వేరు. ఈ రెండింటికీ మధ్య ఓట్ల రాజకీయం ఉంటే ఉండవచ్చు కాక. కానీ రాజకీయాలు ఎపుడూ మారుతూ ఉంటాయి. వివిధ కులాలలోని జనాలు  తమ అభివృద్ధి కోరుకుంటూ దానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక రాజకీయాల్లో ఒక్కోసారి ఒకరిని మెచ్చుకుంటారు, మరికొందరిని వద్దనుకుంటారు. అయితే సమాజంలో ఏ కులాన్ని ఏ ప్రభుత్వం కాదనుకోదు, వారు కూడా అందరితో పాటే కలసి నడుస్తారు కూడా. ఇతర కులాలతో పాటుగా సాగుతూ అన్నదమ్ముల మాదిరిగా ఉంటారు, ఉండాలి కూడా.

ఇదంతా ఎందుకు అంటే రాజకీయాల్లో వస్తున్న కొన్ని దారుణమైన మార్పుల ఫలితంగా ఫలానా కులం అంటే ఆ పార్టీ వారిదా అన్నంతగా ముద్ర వేస్తున్నారు. నిజానికి ఒక ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ లోనే విభిన్న ఆలోచనలు ఉంటాయి. అలాంటి ఒక కులమంతా కట్టకట్టుకుని ఒకే రాజకీయ పార్టీని ఆరాధిస్తుంది అంటే నమ్మలేము. అలాగే వారంతా మావాళ్ళు అని అభిమానంతో ముద్ర వేయాలనుకున్నా అది రాక్షస కౌగిలిగా చివరికి మారుతుంది.

ఏపీలో చాలా కాలంగా అదే జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక కులానికి సంబంధించిన పార్టీ అని తప్పుడు పద్ధతుల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా  అన్ని కులాల నుంచి సహకారం ఉండాలి. అలాగే అందరూ తలా ఓ చేయి వేస్తేనే తప్ప ఉన్నత స్థానం ఎవరికీ దక్కదు. అయితే కొందమంది అతివాదులు మాది ఆ పార్టీ అని చెప్పుకోవచ్చు కాక. అంతమాత్రం చేత అందరూ అలాగే ఉంటారని భావించనక్కరలేదు, యావత్తు కులాన్ని ఆ పార్టీ గాటకు కట్టాల్సిన పని కూడా లేదు.

దాని వల్ల మేలు ఎంత జరిగిందో తెలియదు కాని చేటు మాత్రం చాలానే జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో కమ్మ కులాధిపత్యం ఉంది అన్న భావనతోనే కొన్ని సార్లు గతంలో ఓడిపోయింది. ఇక 2019 ఎన్నికల్లో అది ఎంతదాకా వచ్చింది అంటే ఏకంగా ఏపీ రాజధానిలోనూ వారిదే పెత్తనమని ప్రచారం చేస్తూ వచ్చారు. ఫలితంగా రాజధాని ఆగిపోయింది. ఆ పార్టీ ఓడిపోయింది. ఆ కులమూ ఇబ్బందులు పడుతోంది.

ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు. అయితే పరిణతి కలిగిన  రాజకీయ నాయకులు వీలైనంతవరకూ కులాన్ని పక్కన పెట్టి మాట్లాడాలి. ఇలాంటి ఇబ్బందులను చూసి అయినా తగ్గి మాట్లాడాలి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూస్తే అది కమ్మ సామాజికవర్గానికి మేలు చేయకపోగా కీడు చేసేలాగానే ఉన్నాయంటే తప్పేముంది.

ఆయన నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం అని  తాజాగా హాట్  కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడు.  వైసీపీతో ఆయనకు నిత్య వైరం ఉంటుంది. అలా రెండు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటాయి. అది ఎపుడూ జరిగేదే. కానీ బాబుకి ట్రబుల్స్ క్రియేట్ చేయాలీ అంటే కమ్మలను టార్గెట్ చేయాలీ అన్నది ఎక్కడి విధానం. అలా జరుగుతుందా. అది కుదిరే పనేనా.

సమాజంలో అన్ని వర్గాలు ఉంటాయి. అలాంటపుడు కేవలం ఒక కులానికే ఫలానా ఫలాలు, ఫలితాలు ఇవ్వవద్దు అని ఎవరైనా చెప్పగలరా అది ఆచరణ సాధ్యమా. ఇకపోతే నా మీద ద్వేషంతో కమ్మలకు మంత్రి పదవి ఇవ్వలేదు అని బాబు జగన్ మీద అరోపిస్తున్నారు. అదే ఆరోపణలను తీసుకుంటే చంద్రబాబు బ్రాహ్మణులకు ఎపుడూ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు, తమ మంత్రివర్గంలో అసలు చోటూ కల్పించలేదు. మరి ఎవరి మీద ద్వేషంతో బాబు ఇలా చేశారు అని ఎదురు ప్రశ్నిస్తే ఏం జవాబు చెబుతారు.

అదే విధంగా 2014 నుంచి 2019 దాకా సాగిన బాబు ప్రభుత్వంలో చాలా కాలం గిరిజనులకు, మైనారిటీలకు మంత్రి పదవులు ఇవ్వలేదు. మరి ఆ ఎవరి మీద వ్యతిరేకతతో ఇలా చేశారు అంటే సమాధానం ఉంటుందా. మంత్రి వర్గం కూర్పు అన్నది ఎవరి ఆలోచనలను బట్టి వారు చేసుకుంటూ పోతారు. దానితో ఏకంగా కులాలకే ముడిపెట్టేసి విమర్శలు చేయడం సబబు కాదు.

ఇక తన మీద కోపంతో కమ్మ వారిని టార్గెట్ చేస్తున్నారు అన్న మాటలు కూడా సబబు అయినవి కావు, చంద్రబాబు ఒక కులానికి ప్రతినిధి కాదు, ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత. ఇక సమాజంలో అన్ని కులాలూ ఉంటాయి. వారికి ప్రభుత్వం అన్నీ సమ దృష్టితోనే చేయాలీ, చేస్తారు కూడా. అయితే ఇక్కడ చంద్రబాబు ఈ రకమైన కామెంట్స్ చేయడం వల్ల కమ్మలను టీడీపీ వైపుగా పోలరైజ్ కావాలని ఇండైరెక్ట్ గా పిలుపు ఇస్తున్నట్లుగా ఉంది.

అది రాజకీయంగా ఆయనకు లాభం కలిగించవచ్చేమో కానీ ఒక సామాజికవర్గం ఈ పాలిటిక్స్ వల్ల ఇబ్బంది పడుతుంది అన్నది గుర్తించలేకపోతున్నారనే అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాలు వేరు కులాలు వేరు. కమ్మలను కేవలం టీడీపీ సొత్తు అన్నట్లుగా మాట్లాడడం వల్ల రేపటి రోజున వారిని అన్ని విధాలుగ  తీవ్రంగా నష్టపరుస్తున్నామన్న సంగతి అధినాయకులు గుర్తెరిగితే మంచిదేమో అని మేధావులు హితవు  చెబుతున్నారు.
Tags:    

Similar News