చెరువులో దిగి ఈతకొట్టిన చీఫ్ విప్

Update: 2018-01-08 17:46 GMT
రాజకీయాల్లో కొందరు అల్ప సంతోషులుంటారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా అదే కోవలోకి వస్తారంటారు ఆయన గురించి బాగా తెలిసినవారు. చంద్రబాబు తన క్యాబినెట్ నుంచి ఆయన్ను తొలగించినప్పుడు కూడా రఘునాథరెడ్డి తన ఆవేదనను పెదవి దాటనివ్వలేదు.. ఇంతకాలం మంత్రి పదవిలో ఉంచారు కదా అదే పదివేలు అనుకున్నారు. ఆ తరువాత కొంత గ్యాప్ తరువాత మొన్న చీఫ్ విప్ పదవి దక్కింది. మంత్రిగా పనిచేసినవాణ్ని ఈ పదవి నాకెందుకు అనుకోకుండా ఆయన ఆ బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు... చంద్రబాబు ప్రభుత్వంలో కరవు సీమ అనంతపురానికి నీళ్లొచ్చాయంటూ ఆయన కేరింతలు కొడుతున్నారు.
    
అనంతపురం జిల్లాలోని ప్రధాన చెరువు బుక్కపట్టణం చెరువులో నీళ్లు రావడంతో ఆయన అందులో దిగి ఏకంగా ఈత కొట్టారు. చిత్రావతినదిపై రాయల కాలంలో నిర్మించిన ఈ చెరువులో గత పదేళ్లలో ఎన్నడూ నీరన్నది కనిపించలేదట. దాదాపు ఎడారిలా మారిపోయిందట.  దీంతో చెరువు కింద ఆయుకట్టు రైతులు పంటలపై ఆశలు వదులుకుని పొరుగు ప్రాంతాలకు వలసలో పోయారు. ఇలాంటి సమయంలో కృష్ణా నీటిని ఈ చెరువు వరకు మళ్లించడంతో ఆ ప్రాంతానికి మళ్లీ జలకళ వచ్చింది.ఇది చూసిన పల్లె కూడా తెగ సంతోషించి ఈత కొట్టారు.
    
ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన ఈ చెరువును దగ్గర నుంచి చూస్తే సముద్రాన్ని తలపిస్తోంది. కర్నాటకలో పుట్టిన చిత్రావతి నదిపై అక్రమ కట్టడాలు అధికమవ్వడంతో ఈ చెరువు నిండడం గగనమైంది. పదేళ్ల నుంచి చుక్క నీరు లేకుండా పోయింది. ఈ క్రమంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని తరలించడంతో ఈసారి ఇందులో నీరు కనిపించాయి. ఇదే ఈ మాజీ మంత్రి సంతోషానికి కారణమైంది.

Full View
Tags:    

Similar News