సీఎం ర‌మేశ్ కు షాక్ - స్తంభించిన‌ వాట్సాప్ అకౌంట్

Update: 2019-02-09 07:17 GMT
సెల్ ఫోన్ మ‌నిషికి చేతికి మ‌రో వేలుగా మారిన ఈ రోజుల్లో వాట్సాప్ ఖాతా లేనివారు దాదాపుగా లేనే లేరంటే అతిశ‌యోక్తి కాదు. స‌న్నిహితుల‌తో సంభాష‌ణ‌కు - స‌మాచారం-వీడియోల‌ చేర‌వేత‌కు ఇప్పుడు చాలామంది దాన్నే ఉప‌యోగించుకుంటున్నారు. కొన్నిసార్లు వాట్సాప్ వాడ‌కం స‌మాజానికి ప్ర‌తిబంధ‌కంగానూ మారుతోంది. వ‌దంతుల వ్యాప్తి - అశ్లీల‌ వీడియోల చేర‌వేత‌కు సాధ‌నంగా ప‌నిచేస్తోంది. దీంతో అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు త‌మ‌ను వేదిక‌గా వాడుకుంటున్న‌వారి ఖాతాను స్తంభింప‌జేస్తామంటూ గ‌తంలో వాట్సాప్ సంస్థ ప్ర‌క‌టించింది.

తాజాగా వాట్సాప్ సంస్థ టీడీపీ నేత సీఎం ర‌మేశ్‌ అకౌంట్ విష‌యంలో అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న ఖాతాను స్తంభింప‌జేసింది. సీఎం ర‌మేశ్ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఆయ‌న అత్యంత స‌న్నిహితులు. టీడీపీ స్పాన్స‌ర్ల‌లో ఒక‌రిగా కూడా ఆయ‌న‌కు పేరుంది. అలాంటి ప్ర‌ముఖ వ్య‌క్తి ఖాతాను వాట్సాప్ స్తంభింప‌జేయ‌డం తాజాగా సంచ‌ల‌నంగా మారింది.

కొన్ని రోజులుగా సీఎం ర‌మేశ్ వాట్సాప్ అకౌంట్ ప‌నిచేయ‌డం లేదు. దీంతో ఆయ‌న వివ‌ర‌ణ కోరుతూ వాట్సాప్ సంస్థ‌కు లేఖ రాశారు. వారి నుంచి వ‌చ్చిన స్పంద‌న చూసి అవాక్క‌య్యారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించారంటూ మీ వాట్సాప్ ఖాతాపై ఫిర్యాదులు అందాయ‌ని.. అది నిజ‌మేన‌ని విచార‌ణ‌లో తేల‌డంతో ఖాతాను నిలిపివేశామ‌ని లేఖ‌లో వాట్స‌ప్ ప్ర‌తినిధులు బ‌దులిచ్చారు.

ఎంపీగా ఉన్న వ్య‌క్తి వాట్సాప్ ఖాతాను స్తంభింప‌జేసిందంటే వాట్సాప్ వ‌ద్ద బ‌ల‌మైన సాక్ష్యాధారాలే ఉండొచ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అవి ఏమై ఉండొచ్చున‌ని ఆలోచిస్తున్నారు. ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. సీఎం ర‌మేశ్ వాట్సాప్ అకౌంట్ పై ఎవ‌రు ఫిర్యాదు చేసింది ఎవ‌రు? ఆయ‌న నుంచి వాట్సాప్ లో సందేశాలు అందుకునే అవ‌కాశం - ఆయ‌న అకౌంట్ ను చూసే అవ‌కాశం స‌న్నిహితుల‌కు మాత్ర‌మే ఉంది. మ‌రి వారిలో ఒక‌రే సీఎం ర‌మేశ్ కు వెన్నుపోటు పొడిచారా? అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. మ‌రోవైపు - సీఎం ర‌మేశ్ మాత్రం తన ఖాతా స్తంభ‌న వెనుక కేంద్ర ప్ర‌భుత్వ  కుట్ర ఉంద‌ని ఆరోపిస్తున్నారు. దీనిపై అస‌లు విష‌యాలు వెలుగులోకి రావాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
Tags:    

Similar News