కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు.. జోగితో వైసీపీ ఇర‌కాటం!

Update: 2021-09-21 09:57 GMT
వైసీపీ ఎమ్మెల్యే, బీసీ నాయ‌కుడు జోగి ర‌మేష్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇంటిపైకి దాడికి వెళ్ల‌డాన్ని రాజ‌కీయంగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు చూశాం. అయితే.. ఇప్పుడు ఈ ఘ‌ట‌న మ‌రింత సాగుతోంది. ఈ విష‌యంపై టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. క‌న‌క‌మేడ‌ల రవీంద్ర కుమార్ కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు చేశారు. చంద్ర‌బాబు ఇంటిపైకి మార‌ణాయుధాల‌తో దాడి చేసేందుకు వ‌చ్చార‌ని.. ప్ర‌తిప‌క్ష నేత‌, జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త ఉన్న నాయ‌కుడికే ర‌క్ష‌ణ లేక‌పోతే.. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లుఎలా ఉంటాయ‌ని.. ఆయ‌న కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లాకు క‌న‌క‌మేడ‌ల సుదీర్ఘ ఉత్త‌రం రాశారు.

ఈ లేఖ‌.. రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. మాజీ స్పీక‌ర్‌.. దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ రెండో వ‌ర్ధంతి స‌భ‌కు హాజ‌రైన విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు.. సీఎం జ‌గ‌న్ స‌హా మంత్రులను దుర్భాష‌లాడార‌నేది వైసీపీ నేత‌ల ఆరోప‌ణ‌. దీనిపై జోగి ర‌మేష్ .. త‌న అనుచ‌రుల‌తో క‌లిసి.. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసానికి వ‌చ్చి.. ఆయ‌న నుంచి క్ష‌మాప‌ణ‌లు కోరుతూ.. నిర‌స‌న తెలియ‌జేయాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఉండ‌వ‌ల్లి ఫైట్ తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం.. లాఠీ చార్జీ నిర్వ‌హించ‌డం వంటివి వివాదానికి దారితీశాయి.

అంతేకాదు.. తాజాగా అప్ప‌టి ఘ‌ట‌న‌లో అధికార పార్టీ వైసీపీ నేత‌ల‌ తప్పేం లేదని గుంటూరు పోలీసులు  తేల్చేశారు. వాస్త‌వానికి ఇరు ప‌క్షాల విష‌యాన్ని సున్నితంగా తీసుకుని.. విచార‌ణ చేస్తున్నామ‌ని చెప్పి ఉంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ, ఒక వైపు మాత్ర‌మే పోలీసు సింహం చూసే స‌రికి అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ఈ ఉదంతాన్ని ఇంత‌టితో వ‌దిలేస్తే.. మున్ముందు.. మ‌రింత‌గా త‌మ ప‌రిస్థితి ఇరుకున ప‌డుతుంద‌ని గుర్తించింది. దీంతో వెంటనే రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల‌.. కేంద్రానికి ఫిర్యాదు చేశారు.  చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలని కోరారు.  

వాస్తవానికి సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేతలు, చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేతలు ఇప్పటికే వందలసార్లు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అప్పటికప్పుడు వాటికి ప్రత్యర్ధి పార్టీలు కౌంటర్లు ఇచ్చుకోవ డం, ఆ తర్వాత అంతా మామూలైపోవడం జరుగుతూనే ఉంది. కానీ తాజాగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని పట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లడం ఇప్పుడు వివాదాన్ని రాజేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా తానేం చేసినా చెల్లుతుందనే ధోరణిలో జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి వెళ్లడం, ఆ తర్వాత పోలీసులు కూడా ఆయన తప్పిదాన్ని కప్పిపుచ్చి.. ఆయన్ను అడ్డుకున్న టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టడం వంటివి వివాదాన్ని మ‌రింత రెచ్చ‌గొట్టేలా చేస్తున్నాయి.

జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్దకు కర్రలు, జెండాలతో, మందీ మార్బలంతో రావడం వీడియో ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నా గుంటూరు పోలీసులు తమ నేతలదే తప్పంటూ తేల్చేయడంతో టీడీపీ ఈ వ్యవహారంపై కేంద్రాన్ని ఆశ్రయించింది. చంద్రబాబు ఇంటి వద్ద అసలేం జరిగిందో డ్రోన్ కెమెరాలతో తీసిన వీడియోలను కేంద్ర హోంశాఖకు పంపింది. టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్ అండ్ కో చేసిన హంగామాపై పూర్తి ఆధారాలు సమర్పించారు.  

సమయంలో చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలని కోరారు. ఇప్పటికే జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు ఇంటికే వైసీపీ ఎమ్మెల్యే మందీ మార్బలంతో రావడం, పోలీసులు ఆయన్ను అడ్డుకోకపోవడంపై ఫిర్యాదులో పేర్కొన్న కనకమేడల.... చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే చంద్రబాబు ఇంటి వద్ద ఆ రోజు చోటు చేసుకున్న పరిణామాలపై పూర్తిస్దాయిలో దర్యాప్తు చేయించాలని కూడా హోంశాఖను టీడీపీ ఎంపీ కోరారు.త్వరలో ఇదే ఘటనపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని టీడీపీ ఎంపీ కనకమేడల ప్రకటించారు.

చంద్రబాబు ఇంటిపై కర్రలతో దాడికి వచ్చినా... అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి జోగి రమేష్ ను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న టీడీపీ.. కేంద్రానికి ఈ మేరకు సీరియస్ గా నే ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కేంద్రం కోర్టులోకి వెళ్లినట్లయింది. జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్దకు వస్తారని తెలిసినా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారన్న దానిపై కేంద్ర హోంశాఖ ఇప్పుడు దృష్టి సారించే అవ‌కాశం ఉంది. జోగి రమేష్ ను జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన విపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్దకు ఎలా అనుమతించారన్న దానిపై గుంటూరు పోలీసులు ఇప్పుడు స‌మాధానం చెప్పాల్సి ఉంది. అదేస‌మ‌యంలో.. వివాదానికి కార‌ణ‌మైన అయ్య‌న్న‌పైనా.. కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది. ఇలా మొత్తంగా.. అయ్య‌న్న వ్యాఖ్య‌లు.. మ‌రో రాజ‌కీయ కుంప‌టిని ర‌రాజేశాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News