వైసీపీ లో టీడీపీ కోవర్టులు ఉన్నారా? ఎలా ?

Update: 2022-01-02 13:30 GMT
వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ వైసీపీలో ఈ మధ్య ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వర్గ పోరు తీవ్రంగా ఉన్న జిల్లాల్లో తరచూ ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా.... పార్టీలో అనుమానాలు, అపనమ్మకాలు ఎక్కువవుతున్నాయనడానికి మాత్రం ఇది బలమైన ఉదాహరణ.

కొద్దిరోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు నేతల మధ్య పోరు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్... రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య పచ్చగడ్డి వేస్తే పెట్రోలు కంటే పెద్ద మంటలు వస్తున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజులు వీరిద్దరి మధ్య సయోద్యకు ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. ఎంపీ మార్గాని భరత్ టీడీపీ కోవర్ట్ అని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తరచూ ఆరోపిస్తున్నారు. పార్టీ పెద్దల ముందు కూడా ఇదే మాట చెప్పారు.

2019 ఎన్నికల ముందు వైసీపీ టికెట్ వచ్చే వరకు కూడా మార్గాని భరత్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో తిరగడం, టీడీపీ టిక్కెట్ కోసం తిరగడంతో భరత్‌పై ఈ ఆరోపనలున్నాయి. భరత్ ఇప్పటికీ బుచ్చయ్య చౌదరితో మంచి సంబంధాలు నెరుపుతున్నారని జక్కంపూడి రాజా ఆరోపిస్తున్నారు.

ఇతర జిల్లాలలోనూ ఇలాంటి కోవర్ట్ మాటలు తరచూ వినిపిస్తున్నాయి. కోవర్టు ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు అందుకు తగ్గ ఫలితాలు కూడా అనుభవించారు. శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి ఎంపీ పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ తన ఓటమికి ధర్మాన ప్రసాదరావు కారణమని... కింజరాపు కుటుంబంతో ధర్మాన ప్రసాదరావు కుమ్మక్కవడం వల్లే తాను స్వల్ప తేడాతో ఓడిపోయానని పక్కా లెక్కలు, ఆధారాలతో ఎన్నికలు అయిన వెంటనే నేరుగా జగన్‌కు ఫిర్యాదు చేశారు. ధర్మాన టీడీపీకి కోవర్టు కాకపోయినా కుల అభిమానం,

 శ్రీకాకుళం అసెంబ్లీ సీటులో తన గెలుపు అవసరాల కోసం కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నది దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణ. ఇది జగన్ వద్ద బాగానే పనిచేసింది. ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి రాలేదు... ఆయనకు జగన్ దర్శన భాగ్యమే దొరకడం లేదు. మరోవైపు ఎన్నికల్లో అదృష్టం లభించని దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి దొరికింది.

కృష్ణా జిల్లాలోనూ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఓ నేతను కొందరు వైసీపీ పెద్దలు అనుమానంగా చూస్తున్నారు. తన నిబద్ధత నిరూపించుకోవడానికే ఆయన టీడీపీ పెద్దలపైనే నేరుగా తీవ్ర కామెంట్లు చేస్తున్నారని వినికిడి.

నెల్లూరులో దూకుడుకు మారుపేరుగా చెప్పే ఓ ఎమ్మెల్యే, మరో సీనియర్ నేత పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని చెబుతున్నారు. జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ అంతా తానే అయి అన్ని నియోజకవర్గాలనూ తన గుప్పిట్లో పెట్టుకోవడం... ఆయనకు తోడు మరో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం కూడా ఉండడంతో వారిద్దరూ ఆగ్రహంగా ఉన్నారని టాక్.

దీంతో వారు తమపై ఆరోపణలు చేయకముందే వారిపై టీడీపీ అనుకూల ముద్ర వేస్తున్నారు మిగతా నేతలు.

రాయలసీమ జిల్లాల్లోనూ పలు నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి.
Tags:    

Similar News