బాబు బ్యాచ్ మ‌ళ్లీ మొద‌లెట్టేసిందిరా..!

Update: 2018-08-23 06:16 GMT
రాజ‌కీయ అధినేత‌ల తీరు ఒక్కొక్క‌రిది ఒక్కోలా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తీరు చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంటుంది. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డాల‌నుకున్న‌ వేళ‌.. భావోద్వేగ అంశాల్ని తీసుకొచ్చే అల‌వాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తారు.

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఎదుర్కొనేందుకు ఆయ‌న భారీ అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇస్తారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు కుమ్మ‌రిస్తారు.. విదేశీ.. స్వ‌దేశీ కంపెనీలు ఏపీకి పెట్టుబ‌డుల‌తో పోటెత్తుతున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న‌లు.. ప్ర‌త్యేక క‌థ‌నాలు వండి వార్చేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. మొత్తంగా ఏపీలో ఏదో జ‌రుగుతుంద‌న్న భావ‌న‌కు గుర‌య్యేలా చేస్తుంటారు.

ఇప్ప‌టికే పెట్టుబ‌డులను ఆక‌ర్షించేందుకు భారీ ఎత్తున స‌మ్మిట్లు నిర్వ‌హించ‌టం వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేయ‌టం తెలిసిందే. ల‌క్ష‌లాది కోట్ల రూపాయిలు పెట్టుబ‌డుల రూపంలో ఏపీకి వ‌స్తున్న‌ట్లుగా బాబు చెప్పిన మాట‌ల‌కు ఏ మాత్రం పొంత‌న లేన‌ట్లుగా వాస్త‌వాలు ఉండ‌టం తెలిసిందే. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో ఏపీకి వ‌చ్చిన పెట్టుబ‌డులు మొత్తం క‌లిపినా.. 50 వేల కోట్లు కూడా దాట‌వ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఇలాంటి ఆరోప‌ణ‌లు త‌ప్పంటూ.. తాము సాధించిన‌పెట్టుబ‌డులంటూ ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసింది కూడా లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా బాబు బ్యాచ్ చెల‌రేగిపోయింది. త‌మ అధినేత పాల‌న‌కు మురిసిపోయిన బ‌డా కంపెనీలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌చారం చేస్తున్నారు. ఏపీలో బాబు వ్య‌తిరేక ప‌వ‌నాలు బ‌లంగా వీస్తున్నాయ‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. బాబు బ్యాచ్ అలెర్ట్ అయ్యింది.

ఎప్ప‌టిలానే ఏపీలో ఏదో జ‌రుగుతుంద‌న్న భావ‌న క‌లుగ చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల కాలంలో క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం త‌మ్ముళ్లు చేసిన హ‌డావుడి తెలిసిందే. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా ఈ రోజు ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి పేప‌ర్లలో వ‌చ్చింది. ఏపీలో ఉక్కు ప‌రిశ్ర‌మ పెట్టేందుకు రూ.17వేల కోట్ల పెట్టుబ‌డితో ప‌రిశ్ర‌మ‌ను స్థాపించేందుకు అంత‌ర్జాతీయ కంపెనీ ఒక‌టి వ‌చ్చింద‌ని.. ఆ కంపెనీ త‌న పేరు వెల్ల‌డించొద్ద‌ని.. అన్ని అధికార లాంఛ‌నాలు పూర్తి అయిన త‌ర్వాతే పేరు బ‌య‌ట‌పెట్టాల‌ని.. కేంద్రంతో ట‌ర్మ్స్ స‌రిగా లేనందు వ‌ల్లే.. ఇలాంటి ప‌రిస్థితి ఉంద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు.

ఒక‌వేళ అదే నిజ‌మ‌నుకుంటే.. ఈ వార్త చాల‌దా?  మోడీ స‌ర్కారు అలెర్ట్ కావ‌టానికి.. అంత భారీగా పెట్టుబ‌డులు పెడుతున్న వారు ఎవ‌రు? అన్న‌ది ఆరా తీయ‌టానికి. ఇలాంటి లాజిక్కులు ఆంధ్రోళ్ల‌కు రావ‌నుకున్న ధీమానో ఏమో కానీ.. బాబు ప‌రివారం చెల‌రేగిపోతూ.. భారీ ఎత్తున పెట్టుబ‌డుల వ‌ర్షం ఏపీలో కురుస్తుంద‌న్న‌ట్లుగా గొప్ప‌లు చెప్పుకుంటున్నారు.

ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం రూ.17వేల కోట్లు.. చిత్తూరు.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌తో స‌హా రాష్ట్రంలో మ‌రో రెండుచోట్ల హింద్ వేర్ త‌యారీ ప్లాంట్లు స్థాపించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం స‌ద‌రు కంపెనీ ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబ‌డులు పెట్టనున్న‌ట్లు చెబుతున్నారు. ఇక‌.. విశాఖ‌లో ప్లాంట్ నిర్వ‌హిస్తున్న ఎట్జీ కెమ్ పాలీమ‌ర్స్ సంస్థ పెట్రో కెమిక‌ల్ రంగంలో పెట్టుబడులు పెట్ట‌నుంద‌ని చెబుతున్నారు. రూ.2500 కోట్ల‌తో పూర్తిస్థాయి ప్ర‌తిపాద‌న‌ల్ని మ‌రికొద్ది రోజుల్లో తీసుకురానున్న‌ట్లు చెబుతున్నారు.

కాగితాల మీదా.. ప్ర‌క‌ట‌న‌లకు భారీత‌నాన్ని తెచ్చి పెడుతున్న ఈ అంకెల గొప్ప‌లు నిజంగా వ‌ర్క్ వుట్ అయితే ఏపీకి అంత‌కు మించిన శుభ‌వార్త మ‌రొక‌టి ఉండ‌దు. కానీ.. అదంతా సాధ్య‌మేనా? ఒక‌వేళ అదే నిజ‌మైతే.. గ‌డిచిన నాలుగేళ్లుగా ఏపీకి వ‌చ్చిన పెట్టుబ‌డుల లెక్క‌లు చెబితే బాగుంటుంది. పాత లెక్క‌లు తేల్చిన త‌ర్వాత కొత్త లెక్క‌ల మీద ప్ర‌చారం చేసుకుంటే అంద‌రూ హ‌ర్షిస్తారు. ఆ ప‌ని బాబు బ్యాచ్ చేయ‌గ‌ల‌దా?


Tags:    

Similar News