టీడీపీలో కొలిక్కి వ‌చ్చిన జ‌మ్మ‌ల‌మ‌డుగు పంచాయితీ!

Update: 2019-02-06 08:14 GMT
ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. ఏ స్థానం నుంచి ఎవ‌రు పోటీ చేయ‌నున్నారో స్ప‌ష్ట‌త‌నిస్తున్నాయి. అధికార టీడీపీలో ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ఎంపిక పూర్త‌యింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని స్థానాల్లో మాత్రం కాస్త గంద‌ర‌గోళం నెల‌కొంది. ఆ స్థానాల్లో ఫిరాయింపుదారులే టీడీపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్కించుకుంటారా? లేక తొలి నుంచి పార్టీలో ఉన్న‌వారినే టికెట్ వ‌రిస్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ కోణంలో రాష్ట్రవ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌లమ‌డుగు స్థానం ఒక‌టి. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన రామ‌సుబ్బారెడ్డి ప‌రాజ‌యం పాల‌య్యారు. వైసీపీ క్యాండిడేట్ ఆదినారాయ‌ణ రెడ్డి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. దీంతో ఈ ద‌ఫా జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఎవ‌రు పోటీ చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆదినారాయ‌ణ రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి.. ఈ ఇద్ద‌రికీ జ‌మ్మ‌ల‌మ‌డుగులో గ‌ట్టి ప‌ట్టు ఉంది. వీరిద్ద‌రిలో ఒక‌ర్ని క‌డ‌ప ఎంపీ సీటుకు పోటీ చేయించాల‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు భావించారు. ఆ విష‌యాన్ని వారికి తెలియ‌జేశారు. ఆ ఇద్ద‌రు నేత‌లు మాత్రం అందుకు స‌సేమిరా అంటున్నారు. త‌మ‌కు జ‌మ్మ‌ల‌మ‌డుగు స్థాన‌మే కావాలంటున్నారు. ఆది, రామ‌సుబ్బారెడ్డి ప‌ట్టిన ప‌ట్టు వీడ‌క‌పోవ‌డంతో జ‌మ్మ‌ల‌మ‌డుగు టీడీపీ శ్రేణుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు మ‌రోసారి రంగ‌ప్ర‌వేశం చేశారు. వారిద్ద‌రి మ‌ధ్య పంచాయితీని కొలిక్కి తెచ్చారు. అంందుకోసం ఓ రాజీ వ్యూహాన్ని ప్ర‌యోగించారు. అదేంటంటే.. రామ‌సుబ్బారెడ్డి, ఆది నారాయ‌ణ రెడ్డిల్లో ఎవ‌రు క‌డ‌ప ఎంపీ సీటుకు పోటీ చేస్తే వారికి ముందుగానే ఎమ్మెల్సీ స్థానాన్ని క‌ట్ట‌బెడ‌తారు. ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఉండ‌నే ఉంటుంది. ఇక రెండో వారు జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలి. చంద్ర‌బాబు కుదిర్చిన రాజీకి ఆదినారాయ‌ణ రెడ్డి, రామసుబ్బారెడ్డి అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఈ ద‌ఫా టీడీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News