మరో ఇద్దరు కాంగ్రెస్ మాజీలకు టీడీపీ ఎంపీ టికెట్లు!

Update: 2019-03-13 08:10 GMT
దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఉండి. రాష్ట్ర విభజన సమయం లో కూడా ఆ పార్టీనే నమ్ముకుని ఉన్న పనబాక కుటుంబానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఖరారు అయ్యిందని ప్రచారం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు పనబాక లక్ష్మి. ఏకంగా కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడటంతో ఆ పార్టీ ప్రభ  కోల్పోయింది. అయినా పనబాక లక్ష్మి  కాంగ్రెస్ పార్టీలోనే మిగిలిపోయారు.

ఏదో పార్టీ ఇమేజ్ తో ఈమె ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంలో ఎంపీగా నెగ్గారు గతంలో. వ్యక్తిగతంగా అంత ఛరిష్మా ఉన్న నేత కాకపోవడంతో.. ఈమెను చేర్చుకోవడానికి రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలూ అంత ఆసక్తిని చూపలేదు. దీంతో ఐదేళ్లుగా రాజకీయంగా అజ్ఞాత వాసంలోనే ఉన్నారు పనబాక లక్ష్మి. ఆమెతో పాటు ఆమె భర్త కూడా కాంగ్రెస్ పార్టీలోనే మిగిలారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటూ ఉన్నా.. వీరు అంత లైమ్ లైట్లోకి మాత్రం రాలేదు!

అయితే ఇప్పుడు అనూహ్యంగా వీళ్లకు అవకాశం లభిస్తోందని సమాచారం. ఎస్సీ రిజర్వడ్ ఎంపీ స్థానాల్లో ధీటైన అభ్యర్థుల వేటలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు  పనబాక దంపతులను తన పార్టీలోకి తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.

తిరుపతి నుంచి పనబాక లక్ష్మిని ఎంపీగా పోటీ చేయించాలని అనుకుంటున్నారట చంద్రబాబు. ఈ మేరకు టికెట్ ఖరారు అయ్యిందని.. వారు పార్టీలోకి చేరడమే ఆలస్యం అని సమాచారం అందుతోంది. మరి పార్టీ తీర్థమే పుచ్చుకోకపోయినా టికెట్ ఖరారు కావడం అంటే..పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేవలం పనబాక లక్ష్మికే కాదట.. మరో కాంగ్రెస్ మాజీ.. హర్షకుమార్ కు కూడా తెలుగుదేశం టికెట్ ఖరారు అయ్యిందని సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వైపు వెళ్లి.. ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ వైపు వెళ్లకుండా… అప్పుడప్పుడు చంద్రబాబును తిడుతూ ఐదేళ్లు గడిపేసిన హర్ష కుమార్ కు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఖరారు అయ్యిందనే ప్రచారం ఆసక్తిదాయకంగా ఉంది.

అమలాపురం నుంచి ఎంపీ గా పోటీ చేయనున్నారట హర్షకుమార్. ఈయన కూడా టీడీపీ కండువా కప్పుకోవడమే ఆలస్యం  అని.. టికెట్ ఖరారు అయిపోయిందని సమాచారం అందుతోంది!
Tags:    

Similar News