నిజమే... మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన తెలుగు దేశం పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ దెబ్బల నుంచి ఆ పార్టీ కోలుకోకముందే... పార్లమెంటులో ఆ పార్టీకి మరో ఘోర పరాభవం ఎదురైంది. 30 ఏళ్లుగా పార్లమెంటు భవనంలో టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని మెడబట్టి గెంటేసినంత పని చేశారు. అంతేకాకుండా టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని గెంటేసి... అదే గదిని టీడీపీకి బద్ధ శత్రువుగా ఉన్న వైసీపీకి కేటాయించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజుననే చోటుచేసుకున్న ఈ ఘటనతో టీడీపీకి షాక్ తగిలిందని చెప్పక తప్పదు.
సరే... అసలు ఏం జరిగిందన్న విషయానికి వస్తే పార్లమెంట్‌లో వైసీపీ పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యాలయాన్ని కేటాయించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 22 మంది ఎంపీలను వైసీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని వైసీపీకి కేటాయించారు. ఈ గదిలో గత 30 ఏళ్లుగా టీడీపీ పార్లమెంటరీ కార్యాలయం కొనసాగుతోంది. సరైన సంఖ్యలో సభ్యులు లేనప్పటికీ తనదైన శైలి మేనేజ్ మెంట్ తో అదే కార్యాలయంలో టీడీపీ తిష్ట వేసింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 22 మంది ఎంపీలు గెలవడంతో ఆ కార్యాలయాన్ని వారికి కేటాయిస్తున్నట్లు స్పీకర్ శనివారం తెలిపారు. మూడో అంతస్తులోని 118 నెంబర్ గదికి టీడీపీ కార్యాలయం తరలించారు.
ఈ కేటాయింపు, గదుల మార్పు చేర్పులు సర్వసాధారణమే అయినప్పటికీ... టీడీపీ మొండి వైఖరి నేపథ్యంలో ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదన్న మాట వినిపిస్తోంది. మూడు నెలల కిందటే 22 మంది సభ్యులున్న వైసీపీకి అయిదో నెంబర్ గది కేటాయించినా... టీడీపీ దానిని ఖాళీ చేయలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. మరోసారి ఓం బిర్లాను సాయిరెడ్డి కలవడంతో ఓంబర్లా కాస్తంత కటువుగానే స్పందించారు. స్పీకర్ ఆదేశాలతో పార్లమెంట్ సిబ్బంది.. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గది బయట ఏర్పాటు చేసిన టీడీపీ బోర్డును తొలగించి.. వైసీపీ బోర్డును తగిలించేశారు. దీంతో టీడీపీ ఆ గదిని వదలక తప్పలేదు. ఇదిలా ఉంటే.. టీడీపీని బయటకు గెంటేసి, వైసీపీకి కేటాయించిన 5వ నెంబరు గదికి ప్రధానమంత్రి మోదీ (పదో నెంబర్ గది), హోం మంత్రి అమిత్ షా కార్యాలయాలు అతి సమీపంలో ఉన్నాయట.