బాబు పాల‌న‌ను అంతం చేస్తాం..!!

Update: 2018-05-06 16:27 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుపై బీజేపీ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోమారు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయన విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌తో పాటుగా ఏపీ రాజ‌కీయాల‌పైనా స్పందించారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కీలకాంశంగా ఉంటుంది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత, అధికారపార్టీపై ప్రజాగ్రహం అనేది ఎక్కడా కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.  మొత్తం 224 స్థానాల్లో ఎక్కడికక్కడ వేర్వేరు ఎన్నికల యుద్ధాలు జరిగే అవకాశం ఉంద‌ని, దీంతో ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టతరంగా మారిందని చెప్తున్నారు.

ప‌రిస్థితులు ఇలా ఉన్న‌ప్ప‌టికీ వీర్రాజు క‌ర్ణాట‌క ఫ‌లితాల‌పై ధీమా వ్య‌క్తం చేశారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమ‌ని ఆయ‌న జోస్యం చెప్తున్నారు. సిద్ధార‌మ‌య్య సార‌థ్యంలోని కాంగ్రెస్ పాల‌న‌పై ప్ర‌జ‌లు విసిగిపోయి ఉన్నార‌ని, త‌మ పార్టీకి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వీర్రాజు విశ్వాసం వ్య‌క్తం చేశారు. ప్రధాని మోడీ సభలకు వస్తున్న స్పందనను, భారీ ప్రజాసమూహాలను బ‌ట్టే క‌న్న‌డ ఎన్నిక‌ల‌ను విశ్లేషించ‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించ‌డం ఏమిట‌ని వీర్రాజు ప్ర‌శ్నించారు.

ఇక ఏపీలోని ప‌రిస్థితుల‌పై వీర్రాజు విరుచుకుప‌డ్డారు. సాధారణ పౌరుడి నోట్లోకి రెండు పూటలా ఐదువేళ్లు వెల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.బాబు అసమర్ధ పాలన కారణంగానే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కానీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇవేమీ ప‌ట్ట‌డం లేద‌ని మండిప‌డ్డారు. త‌న అస‌మ‌ర్థ‌త‌, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడిగితే కేసులు పెడతామన్న చంద్రబాబు ఇప్పుడు మాటమార్చడం సరికాదన్నారు.  ఏపీలో టీడీపీ అవినీతి పరిపాలనను అంతం చేసి.. మంచిపరిపాలనను తీసుకొస్తామని వీర్రాజు ప్ర‌క‌టించారు. మంచి పరిపాలన తీసుకొచ్చే వారితో కలిసి పోటీ చేస్తామని పొత్తుల గురించి వీర్రాజు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

Tags:    

Similar News