చింత‌ల‌పూడి టీడీపీ టిక్కెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే సోద‌రుడు... ఈక్వేష‌న్లు క‌లిసొస్తాయా ?

Update: 2023-01-01 06:04 GMT
ఏలూరు జిల్లా చింత‌ల‌పూడి టీడీపీ టిక్కెట్ రేసు అనూహ్య మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆశావాహుల‌ను తోసిరాజ‌ని మ‌రో బ‌ల‌మైన అభ్య‌ర్థి తెర‌మీద‌కు దూసుకువ‌చ్చారు. జిల్లాలో ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు తోడు, బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యంతో పాటు ఆర్థిక‌, అంగ‌బలాలు క‌ల‌గ‌లిపిన కుటుంబ నేప‌థ్యం ఉండ‌డంతో స‌ద‌రు అభ్య‌ర్థి వైపు అధిష్టానం కూడా మొగ్గు చూపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఆ కొత్త అభ్య‌ర్థి ఎవ‌రో కాదు ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మాజీ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన దివంగ‌త బొమ్మాజీ దానం కుమారుడు, సంత‌నూత‌ల‌పాడు మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత టీడీపీ ఇన్‌చార్జ్ బీఎన్‌. విజ‌య్‌కుమార్‌కు స్వ‌యానా సోద‌రుడు అయిన బొమ్మాజీ అనిల్‌. అనిల్ ఫ్యామిలీ నేప‌థ్యం విష‌యానికి వ‌స్తే ఆయ‌న తండ్రి బి. దాన‌య్ 20 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వ హ‌యాంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసి స‌మ‌ర్థ‌వంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

ఆయ‌న‌కు చంద్ర‌బాబుతో మంచి స‌ఖ్య‌త ఉండేది. అప్ప‌ట్లో జిల్లాలో మంత్ర‌లుగా ప‌నిచేసిన వారితో పాటు టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌తోనూ స‌న్నిహిత సంబంధాలే ఉండేవి. ఆయ‌న వార‌సుడు విజ‌య్‌కుమార్ 2009లో ప్ర‌కాశం జిల్లా ( ఇప్పుడు బాప‌ట్ల జిల్లా)లోని సంత‌నూత‌ల‌పాడు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున తొలి ప్ర‌య‌త్నంలోనే ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీలోకి వ‌చ్చి రెండోసారి అక్క‌డ నుంచే పోటీ చేసిన విజ‌య్ స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ప్ర‌స్తుతం సంత‌నూత‌ల‌పాడు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న విజ‌య్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ పోటీకి రెడీ అవుతున్నారు.

ఇప్పుడు ఆయ‌న సోద‌రుడు ఎన్నారై అయిన బొమ్మాజీ అనిల్ ఏలూరు జిల్లా చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ స్థానం నుంచి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబును క‌లిసి ఆర్థికంగా ఏ మాత్రం చూసుకోవాల్సిన ప‌నిలేద‌ని.. సీటు ఇస్తే గెలుచుకు వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త వారం రోజులుగా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల‌పై త‌న సోద‌రుడు, మాజీ ఎమ్మెల్యే విజ‌య్‌కుమార్‌తో క‌లిసి ఫోక‌స్ పెట్టిన అనిల్‌.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ పార్టీలో ప్ర‌ముఖ నాయ‌కుల‌ను క‌లుస్తున్నారు.

పైగా ఉమ్మ‌డి జిల్లాలో మ‌రో రెండు రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్లు గోపాల‌పురం, కొవ్వూరు మాదిగ సామాజికే వ‌ర్గానికే ఇవ్వ‌నున్నారు. చింత‌ల‌పూడి మాల‌ల‌కు ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. వైసీపీ జిల్లాలో చింత‌ల‌పూడి, గోపాల‌పురం సీట్లు మాల‌ల‌కే ఇస్తోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ చింత‌ల‌పూడి సీటు ఖ‌చ్చితంగా మాల‌ల‌కే ఇవ్వాల్సి ఉంది. ఈ ఈక్వేష‌న్ కూడా అనిల్‌కు ప్ల‌స్ కానుంది. అన్నింటికి మించి ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం చాలా ప్ల‌స్ పాయింట్‌. ఏదేమైనా చింత‌ల‌పూడి టీడీపీ టిక్కెట్ రేసులోకి మ‌రో బ‌ల‌మైన నేత రెడీ అవ్వ‌డంతో రేసు మంచి ర‌స‌వ‌త్త‌రంగా మారింది.
Tags:    

Similar News