ఈ టీడీపీ ఇద్ద‌రు ఎంపీల విష‌యంలో అస్ప‌ష్ట‌త తొల‌గిపోయిన‌ట్టేనా?

Update: 2022-07-16 05:30 GMT
2019 ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీకి మూడు ఎంపీ స్థానాలే మాత్ర‌మే ద‌క్కిన సంగతి తెలిసిందే. గుంటూరు, విజ‌య‌వాడ‌, శ్రీకాకుళం లోక్ స‌భ స్థానాల్లో మాత్ర‌మే టీడీపీ బొటాబొటీ మెజారిటీతో గెలుపొందింది. కాగా ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఎంపీలు కేశినేని నాని, గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీని వీడ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా ప‌లు సంద‌ర్భాల్లో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధిష్టానంపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. పార్టీతో అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

విజ‌య‌వాడ టీడీపీలో ఎంపీ కేశినేని నానికి, విజ‌య‌వాడ న‌గ‌ర టీడీపీ అధ్య‌క్షుడు బుద్ధా వెంక‌న్న‌, మ‌రో నేత నాగుల్ మీరాతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ప‌లుమార్లు వీరు రోడ్లెక్కి మ‌రీ బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ విభేదాలు ముదిరి పాకాన ప‌డ్డాయి. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థుల‌కు టికెట్ల విష‌యంలో వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు పొడ‌సూపాయి. టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ప్ర‌చారంలోకి వ‌చ్చారు. అయితే ఇందుకు బుద్ధా, నాగుల్ మీరా వ‌ర్గాలు ఒప్పుకోలేదు.

అయితే కేశినేని కుమార్తె శ్వేత కార్పొరేట‌ర్ గా విజ‌యం సాధించినా కార్పొరేష‌న్ లో వైఎస్సార్సీపీ గెలుచుకుంది. దీంతో మేయ‌ర్ పీఠం వైఎస్సార్సీపీకే పోయింది. కేశినేని కుమార్తె కేవ‌లం కార్పొరేట‌ర్ గానే మిగిలిపోయారు. ఈ నేప‌థ్యంలో కేశినేని టీడీపీ అధిష్టానంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు. బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ అండ‌దండ‌లు అందిస్తున్నార‌ని భావించిన కేశినేని తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. టీడీపీ నుంచి కేశినేని నాని త‌ప్పుకుంటార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

మ‌రోవైపు గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం లక్ష్యంగా చేసుకుంద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జ‌యదేవ్ కు చెందిన అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ కాలుష్యాన్ని వెద‌జ‌ల్లుతోంద‌ని, దీనివ‌ల్ల భూగ‌ర్భ జ‌లాలు క‌లుషిత‌మ‌య్యాయ‌ని ఆరోపిస్తూ దానికి సీల్ వేసింది. దీనిపై హైకోర్టును ఆశ్ర‌యించారు.. గ‌ల్లా.  ఈ నేప‌థ్యంలో గ‌ల్లా జ‌య‌దేవ్ బీజేపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కొంత‌కాలంగా ఆయ‌న టీడీపీతో దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌ల్లా జ‌య‌దేవ్, కేశినేని నాని టీడీపీని టాటా చెబుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిర్వ‌హించిన స‌మావేశానికి ఈ ఇద్ద‌రు ఎంపీలు హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించ‌డానికి చంద్ర‌బాబు టీడీపీ ఎంపీల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, రాజ్య‌స‌భ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ ల‌తోపాటు విజ‌య‌వాడ‌, గుంటూరు ఎంపీలు కేశినేని నాని, గ‌ల్లా జ‌య‌దేవ్ లు కూడా హాజ‌ర‌య్యారు. దీంతో వారు టీడీపీని వీడ‌తార‌నే వార్త‌ల‌కు చెక్ ప‌డిన‌ట్ట‌యింది. పార్టీ ఎంపీలు చంద్రబాబుతో ఉన్న చిత్రాన్ని కేశినేని నాని స్వయంగా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
Tags:    

Similar News