తీన్మార్ మల్లన్న చేతుల్లోకి 'టీడీపీ'

Update: 2023-01-06 09:30 GMT
తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీని ఎలాగైనా సరే తిరిగి లేపాలని ఆ పార్టీ అధినేత కృతనిశ్చయంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ మరో 10 నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నిస్తోంది.

ఇటీవల తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశర్ ముదిరాజ్‌ను నియమించడం ద్వారా పార్టీని పునరుద్ధరించిన చంద్రబాబు, రాష్ట్రంలో పార్టీ ఉనికిని నిరూపించేందుకు డిసెంబర్‌లో ఖమ్మంలో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగించి టీడీపీని పునరుద్దరిస్తున్నట్టు ప్రకటించారు.

తెలంగాణలో టీడీపీకి ఇంకా బతికే ఉందని, సొంత ఓటు బ్యాంకు ఉందని నిరూపించుకోవాలని చంద్రబాబు తహతహలాడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇది తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి టీడీపీ స్నేహ హస్తం అందించేందుకు దోహదపడుతుందని అంటున్నారు.

తెలంగాణలో కొన్ని సీట్లు గెలిచి బిజెపికి సహాయం చేయడం ద్వారా క్విడ్ ప్రోకో వ్యూహంలో భాగంగా ఆంధ్రాలో బిజెపి మద్దతును చంద్రబాబు కోరుతున్నారు. అయితే, బిజెపి మాత్రం చంద్రబాబు రాజకీయాలకు పెద్దగా ప్రతిస్పందించడం లేదు. తెలంగాణ ఎన్నికలలో టిడిపిని దూరంగా ఉంచాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.టీడీపీతో ఎలాంటి అవగాహన లేదని.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని అన్నారు.

మరో మార్గం లేకపోవడంతో టీడీపీ ఇప్పుడు ప్రత్యామ్నాయ కూటమి భాగస్వాముల కోసం వెతుకుతోంది. అటువంటి తాజా ప్రయత్నంలో బీజేపీకి దూరంగా ఉంటున్న పార్టీ వివాదాస్పద రాజకీయ కార్యకర్త తీన్మార్ మల్లన్నతో చేతులు కలపాలని టీడీపీ భావిస్తోంది.  గురువారం తీన్మార్ మల్లన్నతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సుదీర్ఘంగా సమావేశమై తెలంగాణలో టీడీపీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.

చంద్రబాబు సైతం మల్లన్నతో ఫోన్‌లో మాట్లాడి తెలంగాణలో టీడీపీతో కలిసి పనిచేయాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. మల్లన్నతో చేతులు కలపాలని, పార్టీ బలోపేతానికి ఇరువురు కలిసికట్టుగా కృషి చేయాలని జ్ఞానేశ్వర్‌ను కోరారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తీన్మార్ మల్లన్న హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పనిచేసి ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపునకు సహకరించారు. ఆ తర్వాత బీజేపీ విధానాలకు విసిగి దూరమయ్యారు.

తెలంగాణలో టీడీపీకి మల్లన్న ఏవిధంగా సాయం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రా పార్టీతో ఈ అరవీర తెలంగాణ ఉద్యమకారుడు కలుస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News