మోహ‌న్ బాబు చేసిన డ్యామేజ్ కంట్రోల్ కి త‌మ్ముడు దిగాడు

Update: 2019-03-22 10:44 GMT
అదేం సిత్ర‌మో కానీ..వేలాది కోట్ల రూపాయిలు బ‌కాయిలు ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క‌రంటే ఒక్క‌రు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శ‌లు చేయ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. బాధ‌ను పంటి బిగువ‌న భ‌రిస్తారే కానీ కేసీఆర్ స‌ర్కారు మీద ఒక్క మాట అనేందుకు స‌సేమిరా అంటారు. అదే స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద మాత్రం అందుకు భిన్నంగా బ‌య‌టోళ్లు త‌ర్వాత‌.. సొంత పార్టీకి చెందిన నేత‌లు సైతం నిప్పులు చెరుగుతుంటారు.

తాజాగా సినీ న‌టుడు శ్రీ‌విద్యానికేత‌న్ విద్యాసంస్థ‌ల అధినేత మోహ‌న్ బాబు చేసిన నిర‌స‌న ర్యాలీ.. ఆ సంద‌ర్భంగా బాబును క‌డిగేసిన తీరు ఏపీ స‌ర్కారుకు ఎంత డ్యామేజింగ్ గా మారింద‌న్న విష‌యం తాజాగా టీడీపీ నేత కుటుంబ రావు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే అర్థ‌మైపోతుంది. ఏపీ ప్లానింగ్ క‌మిష‌న్ ఉపాధ్య‌క్షుడు  కుటుంబ‌రావు మాట్లాడుతూ.. గ‌డిచిన ఐదేళ్ల‌లో రూ.14,510 కోట్ల ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ను ప్ర‌భుత్వం చెల్లించిన‌ట్లు చెప్పారు.

త‌న తాజా నిర‌స‌న ర్యాలీతో మోహ‌న్ బాబు ఏం చెప్పాల‌నుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. మోహ‌న్ బాబు విద్యాదానం చేస్తున్నారా?.  బిజినెస్ చేస్తున్నారా? అంటూ ప్ర‌శ్నించిన కుటుంబ రావు.. ఆయ‌న బ‌య‌టకు మాత్రం త‌న కాలేజీలో విద్యార్థుల‌కు ఉచితంగా చ‌దువు చెబుతున్న‌ట్లుగా చెబుతారు.

25శాతం మంది విద్యార్థుల‌కు తానే ఫీజులు కడుతున్న‌ట్లు చెబుతారు. అలాంట‌ప్పుడు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అడ‌గ‌టం ఎందుకు? అని ప్ర‌శ్నించారు. మోహ‌న్ బాబు న‌డుపుతున్న నాలుగు కాలేజీల్లో చ‌దివే విద్యార్థులంద‌రికి ఆయ‌న ఫీజురీయింబ‌ర్స్ మెంట్ వ‌సూలు చేస్తార‌ని.. అలాంట‌ప్పుడు ఆయ‌న ఉచితంగా చ‌దువు చెబుతున్న‌ట్లు ఎందుకు అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.

ఆయ‌న ఎవ‌రిని ఉచితంగా చ‌దువులు చెబుతున్నారు? అని ప్ర‌శ్నించిన కుటుంబ‌రావు.. ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు స‌ర్కారును దెబ్బ తీయ‌టానికి.. బుర‌ద జ‌ల్ల‌టానికే నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే.. మోహ‌న్ బాబు నిర్వ‌హించిన నిర‌స‌న ర్యాలీ ఏపీ అధికార‌ప‌క్షంలో క‌ల‌క‌లం రేప‌ట‌మే కాదు.. దాని ద్వారా జ‌రిగే డ్యామేజ్ ను కంట్రోల్ చేయ‌టానికి తెలుగు త‌మ్ముడ్ని అర్జెంట్ గా మైకు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టాల‌ని పంపిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News