గాలి ప్రాణాల్ని తీసిన డెంగ్యూ దోమ‌!

Update: 2018-02-07 05:40 GMT
టీడీపీ సీనియ‌ర్ నేత‌.. మాజీ మంత్రి.. ఏపీ ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రిస్తున్న గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడి ఆక‌స్మిక మ‌ర‌ణంపై ప‌లువురు షాక్ తింటున్నారు. యాక్టివ్ గా ఉంటే గాలి ముద్దు కృష్ణ‌మ ఎప్పుడు అనారోగ్యానికి గుర‌య్య‌ర‌న్న విస్మ‌యానికి ప‌లువురు గురి అవుతున్నారు.

గాలి ఆక‌స్మిక మ‌ర‌ణానికి కార‌ణంగా డెంగ్యూ దోమ‌గా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం డెంగ్యూ జ్వ‌రానికి గురైన గాలి ముద్దుకృష్ణ‌మ తీవ్ర నీర‌సానికి గురి కావ‌టంతో ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. హైద‌రాబాద్ లోని ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న గాలి త్వ‌ర‌గా కోలుకుంటార‌ని భావించారు. డెంగ్యూ జ్వ‌రంగా సాధార‌ణం కావ‌టంతో ఎవ‌రూ సీరియ‌స్ గా తీసుకోలేదు. ఈ కార‌ణంతోనే ఆసుప‌త్రిలో చేరిన‌ప్ప‌టికీ ఆయ‌న అనారోగ్య వార్త మీడియాలో పెద్ద‌గా హైలెట్ కాలేదు.

అయితే.. 71 ఏళ్ల వ‌య‌సులో ఉండ‌టం.. జ్వ‌రం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో గాలి కోలుకోలేక‌పోయార‌ని చెబుతున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం కూడా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి సీరియ‌స్ గా లేద‌ని చెబుతున్నారు. అంత‌లోనే ప‌రిస్థితి మారి.. విష‌మంగా మారిందంటున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే గాలి గుండెకు శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు. శ‌స్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న ఆయ‌న డెంగ్యూ జ్వ‌రం బారిన ప‌డ‌టమే ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణంగా చెబుతున్నారు. అంత పెద్ద నాయ‌కుడి ప్రాణాల్ని చిన్న దోమ తీయ‌టం.. అంద‌రికి వ‌చ్చే డెంగ్యూ జ్వ‌రంతో ఒక సీనియ‌ర్ నాయకుడి ప్రాణాలు పోవ‌టంపై ఆయ‌న్ను అభిమానించే వారు తీవ్ర ఆవేద‌న‌కు గురి అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. గాలి మృతిపై నంద‌మూరి హ‌రికృష్ణ తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. గాలి ముద్దుకృష్ణ‌మ మృతి త‌మ కుటుంబానికి వ్య‌క్తిగ‌తంగా బాధించింద‌న్నారు. 1983లో ఎన్టీఆర్ పిలుపు మేర‌కు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గాలి.. తుదిశ్వాస వీడే వ‌ర‌కు ఆయ‌న త‌మ వెంటే ఉన్నార‌ని హ‌రికృష్ణ చెప్పారు. త‌మ కుటుంబానికి గాలి ఎంతో స‌న్నిహిత‌మ‌న్నారు. గాలి మృతి వార్త విన్నంత‌నే తాను షాక్ కు గురైన‌ట్లు చెప్పారు.
Tags:    

Similar News