గాలి ముద్దుకృష్ణ‌మ ఆక‌స్మిక మ‌ర‌ణం

Update: 2018-02-07 04:41 GMT
తెలుగుదేశం పార్టీకి మ‌రో దెబ్బ త‌గిలింది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ (71) మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత క‌న్నుమూశారు. గ‌డిచిన రెండు రోజులుగా జ్వ‌రంతో బాధ ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్ లోని ఒక ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న్ను ర‌క్షించేందుకు వైద్యులు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. దీంతో.. మంగ‌ళ‌వారం అర్థరాత్రి దాటిన త‌ర్వాత ప్రాణాలు విడిచారు.

ఊహించ‌ని రీతిలో గాలి ముద్దుకృష్ణ‌మ మ‌ర‌ణ‌వార్త వెలువ‌డ‌టం షాకింగ్ గా మారింది. ప్ర‌స్తుతం త‌రుప‌తిలోని ప‌ద్మావ‌తి పురంలో నివాసం ఉంటున్నారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త‌తో కుటుంబ స‌భ్యులు.. పార్టీ నేత‌లు.. అభిమానులు తీవ్ర శోకంతో ఉన్నారు. గాలి మ‌ర‌ణవార్త విన్నంత‌నే టీడీపీ వ‌ర్గాలు దిగ్భాంత్రికి గురి అవుతున్నాయి.

ఫైర్ బ్రాండ్ నేత‌గా పేరున్న గాలి ముద్దుకృష్ణ‌మ రాజ‌కీయ ప్ర‌యాణం ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది. ఎన్టీఆర్ పిలుపుతో ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. చిత్తూరు జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లం వెంక‌ట్రామాపురంలో జి. రామానాయుడు.. రాజ‌మ్మ దంప‌తుల‌కు 1947 జూన్ 9న  జ‌న్మించారు. చ‌దువు పూర్తి అయ్యాక అధ్యాప‌క వృత్తిలో ప్ర‌వేశించారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చే స‌మ‌యానికి గుంటూరు జిల్లా పెద‌నందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాప‌కుడిగా ప‌ని చేసేవారు.

1983లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న చిత్తూరు జిల్లా న‌గ‌రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఎన్టీఆర్ హ‌యాంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులైన గాలి ముద్దుకృష్ణ‌మ‌లోని మ‌రో ల‌క్ష‌ణం.. తాను ల‌క్ష్యం చేసిన వారిపై సునిశితంగా విమ‌ర్శించటంలో దిట్ట‌. తాను ఎంపిక చేసుకున్న అంశంపై తుదికంటా పోరాడే త‌త్త్వం ఆయ‌న సొంతం.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయ‌న.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా చేతిలో ఓడిపోయారు. అనంత‌రం ఆయ‌న ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. చివ‌రి రోజుల్లో ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన‌.. ఆరంభంలో ఆయ‌న రికార్డుల్ని తిర‌గ‌రాసిన చ‌రిత్ర ఉంది. పుత్తూరు నుంచి ఆరుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించి రికార్డుల‌కు ఎక్కారు. విద్య‌.. అట‌వీశాఖ‌.. ఉన్న‌త విద్యా మంత్రిగా ఆయ‌న ప‌లు ప్ర‌భుత్వాల్లో వ్య‌వ‌హ‌రించారు. టీడీపీ నేత‌గా సుప‌రిచితులైన ఆయ‌న కొద్దికాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2008లో తిరిగి టీడీపీలో చేరిన ఆయ‌న 2009లో పుత్తూరు నుంచి విడిపోయి కొత్త‌గా ఏర్ప‌డిన న‌గ‌రి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్ప‌ట్లో టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంతో ఆయ‌న‌కు మంచి ప‌ద‌వి ద‌క్క‌లేదు. 2014 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓట‌మిపాలు కావ‌టంతో ఆయ‌న్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపారు. గాలి మ‌ర‌ణ‌వార్త టీడీపీ వ‌ర్గాల్ని క‌లిచివేసింది. ఆయ‌న్ను అమితంగా అభిమానించే అభిమానుల‌కు తీర‌ని శోకాన్ని మిగిల్చింది.


Tags:    

Similar News