ఒకేఒక్క తమ్ముడికే కారు ఎక్కే ఛాన్స్?

Update: 2016-02-18 05:05 GMT
ఆపరేషన్ టీడీపీ ఫినిష్ చివరి అంకానికి చేరుకుందా? మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో పది మందిని కారు ఎక్కించిన తెలంగాణ అధికారపక్షం తర్వాతి అడుగు ఏమిటి? ఎవరిని టార్గెట్ చేసింది? ఎంతమందిని కారు ఎక్కించుకోనుంది? లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో టీడీపీ అన్నది లేకుండా చేయాలన్నదే లక్ష్యంగా అడుగులేస్తున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు తమ్ముళ్లను గులాబీ దళంలో భాగస్వామ్యం చేసిన సంగతి తెలిసిందే.

మొత్తం 15 మంది తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో 10 మంది టీఆర్ ఎస్ లోకి వెళ్లిపోగా మరో ఐదుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిలో ఎంతమంది కారు ఎక్కే ఛాన్స్ ఉందంటే.. కేవలం ఒకే ఒక్కరికి మాత్రమే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఓకే చెబుతారన్న మాట వినిపిస్తోంది. అదెలానంటే.. మిగిలిన ఐదుగురు తమ్ముళ్లలో బీసీ ఉద్యమనేత ఆర్ కృష్ణయ్య తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని తేల్చేస్తున్నారు. మిగిలిన నలుగురిలో రేవంత్ రెడ్డికి.. టీఆర్ ఎస్ అధినేతకు మధ్యనున్న రచ్చ ఏ రేంజ్ అన్నది అందరికి తెలిసిందే. ఆయన్ను మినహాయిస్తే మిగిలిన ముగ్గురిలో సండ్ర ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి ఉన్నందున.. ఆయన్ను పార్టీలోకి చేర్చుకుంటే లేనిపోని తలనొప్పులు ఖాయమంటున్నారు.

ఇక.. మిగిలిన ఇద్దరిలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీని ఎట్టి పరిస్థితుల్లో కారు ఎక్కించొద్దని.. ఇప్పటికే ఆయన సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు కేసీఆర్ అండ్ కో కు స్పష్టంగా చెప్పినట్లుగా చెబుతున్నారు. దీంతో.. వారి మాటను కేసీఆర్ కాదనలేరని చెబుతున్నారు. దీంతో.. ఇక మిగిలింది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఒక్కరే. ఆయన ఒక్కరికి మాత్రమే కారు ఎక్కే ఛాన్స్ ఉందని.. ఆయన మినహా మరే తమ్ముడికి కారు ఎక్కే అవకాశాన్ని కేసీఆర్ ఇవ్వరని తేల్చి చెబుతున్నారు.
Tags:    

Similar News