ఆమెను గెలిపించిన ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్‌!

Update: 2021-12-18 02:30 GMT
పార్టీ కోసం ప‌నిచేసే నాయ‌కుల‌కు ఎప్పుడూ ప్రాధాన్య‌త దక్కుతూనే ఉంటుంది. ఇప్పుడా విషయం మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన మున్సిపాలిటీ, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌ర్థి టీడీపీని మ‌రోసారి చావు దెబ్బ తిస్తూ అద్భుత విజ‌యాల‌ను అందుకుంది. కానీ వైసీపీ హ‌వాలోనూ టీడీపీకి చెందిన ఓ అభ్య‌ర్థిని జెడ్పీటీసీగా గెలిపించిన ఆ పార్టీ నాయ‌కుడు జీవీ ఆంజ‌నేయులు బాబు మ‌న్న‌న‌లు పొందారు. దీంతో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాన‌ని బాబు మాట ఇచ్చార‌ని స‌మాచారం.

గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలోని శావ‌ల్యాపురం జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థి పారా హైమావ‌తి విజ‌యం సాధించారు.  శావ‌ల్యాపురం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడి మండ‌లం కావ‌డం విశేషం. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలాకాలోనే ఆయ‌న గ్రామం నుంచే పోటీ చేసిన టీడీపీ అభ్య‌ర్థి గెల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే ఈ విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం ఆంజ‌నేయులు. ఈ ఎన్నిక‌ల్లో ఈ మాజీ ఎమ్మెల్యే ఆంజ‌నేయులు అంతా తానై వ్య‌వ‌హ‌రించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభం నుంచి పోలింగ్‌, కౌంటింగ్ వ‌రకూ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఎప్పటిక‌ప్పుడూ అప్ర‌మ‌త్తం చేస్తూ విజ‌యాన్ని సాధించ‌గ‌లిగారు. అధికార వైసీపీ పార్టీ ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా బెదిరింపుల‌కు త‌గ్గ‌కుండా ఆయ‌న ప‌ని చేసిన‌ట్లు స‌మాచారం. ఈ విజ‌యంతో వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ష్ట‌ప‌డితే తిరిగి టీడీపీకి పున‌ర్వైభ‌వాన్ని తీసుకు రావొచ్చ‌నే న‌మ్మ‌కాన్ని ఆయ‌న క‌ల్పించార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యే గ్రామానికి చెందిన అభ్య‌ర్థినే పోటీలో దింపి గెలిపించుకోవ‌డంతో ఆంజ‌నేయులు స‌వాలు విసిరిన‌ట్ల‌యింది. ఇది అధికార పార్టీ ఎమ్యెల్యేను గ‌ట్టిగా దెబ్బ కొట్ట‌డ‌మేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక కౌంటింగ్‌లోనూ ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా కోర్టును ఆశ్ర‌యించి ప్ర‌త్యేక ఎన్నిక‌ల అధికారితో లెక్కింపు ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిపించార‌ని తెలిసింది. ఇలా వైసీపీ ఎత్తుల‌ను చిత్తు చేసిన ఆంజ‌నేయుల‌ను బాబు స్వ‌యంగా అభినందించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వినుకొండ అభ్య‌ర్థిగా ఆంజ‌నేయులు పోటీచేసి అఖండ మెజారిటీతో గెలుస్తార‌ని బాబు ధీమా వ్య‌క్తం చేశారు. దీంతో కార్య‌క‌ర్త‌ల్లో నూత‌నోత్సాహం నింపారు. ఇక బాబు మాట‌తో మ‌రింత ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగేందుకు ఆంజ‌నేయులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇటీవ‌ల ఓ కాల‌నీలో విద్యుత్ బ‌కాయిలు చెల్లించ‌లేద‌ని క‌రెంట్ క‌ట్ చేయ‌డానికి నిర‌స‌న‌గా ఆయ‌న రాత్రిపూట కాల‌నీలోనే నిద్రించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News