కొల్లు రవీంద్ర దీక్షతో మచిలీపట్నంలో హైటెన్షన్

Update: 2019-10-11 07:14 GMT
కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు  హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరసన దీక్ష నేపథ్యంలో పోలీసులు పలువురు టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. దీక్షకు వెళ్లకుండా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు సహా పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఇసుక కొరత తీర్చాలని డిమాండ్‌ చేస్తూ మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో టీడీపీ నేత - మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల నిరవధిక దీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీంతో కొల్లు రవీంద్ర నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రవీంద్ర దీక్షను విఫలం చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. తెలుగుదేశం నాయకులను గృహనిర్బంధం చేస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రవీంద్ర ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు - కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు - ఎమ్మెల్సీ బచ్చుల అర్జునిడిని ఇంటికే పరిమితం చేశారు. అయితే అర్జునుడిని పోలీసులు అరెస్టు చేశారన్న వార్త బయటకు రావడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో టెన్షన్‌ మొదలయ్యింది. దీంతో టీడీపీ నాయకులు ఎవరినీ అరెస్టు చేయలేదని - ఊహాగానాలు నమ్మవద్దని అడిషనల్‌ ఎప్పీ సత్తిబాబు ప్రకటన చేశారు. టీడీపీ - వైసీపీ పార్టీల్లో ఎవరికీ శిబిరాల ఏర్పాటుకు అనుమతించలేదని - అందువల్ల శాంతిభద్రతల పరిరక్షణకు అంతా సహకరించాలని ఏఎస్పీ కోరారు. డీఆర్పీ సమావేశం ఉన్నందున శాంతిభద్రత విఘాతానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

కాసేపటి క్రితం ఇసుక కొర‌త‌కు నిర‌స‌న‌గా దీక్ష చేప‌ట్టిన  మాజీ మంత్రి, -టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్రను  పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా ఇసుక కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే. అరెస్ట్‌లు ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఇసుక కృత్రిమ కొరతకు నిరసనగా మచిలీపట్నం కోనేరు సెంటర్‌ దగ్గర కొల్లు తలపెట్టిన 36 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేసినా.. తర్వాత మళ్లీ ఆందోళనకు దిగుతానని ఆయ‌న ప్రకటించారు.
Tags:    

Similar News