హత్య జరిగే వేళలో ఎస్పీ ఆఫీసులో కొల్లు ఏం చేస్తున్నారు?

Update: 2020-07-11 04:15 GMT
ఏపీ అధికార పక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోకా భాస్కరరావు హత్య ఉదంతంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన మీద వస్తున్న ఆరోపణల్ని టీడీపీ తమ్ముళ్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. కావాలనే కొల్లును ఇరికిస్తున్నారని పేర్కొంటున్నారు. పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చేసిన టీడీపీ నేతలు.. హత్యకు గురైన మోకా భాస్కర రావుకు ఉన్న నేర చరిత్రను బయటపెడుతున్నారు.

హత్యకు గురైన మోకా భాస్కరరావు మీద 90కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రెండు అత్యాచార కేసులు.. ఆరుహత్య కేసులు.. పద్దెనిమిది దొంగతనాలు.. 38 సివిల్ కేసులు.. 24 పెట్టీ కేసులు ఉన్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. హత్య జరిగిన రోజున మాజీ మంత్రి కొల్లు రవీందర్ ఎస్పీ కార్యాలయంలో.. ఎస్పీ ఎదుటే ఉన్నట్లు చెప్పారు. హత్య జరిగిన రోజున హత్య చేసిన వారితో మాట్లాడి.. వారిని అభినందించినట్లుగా చేస్తున్న ఆరోపణల్ని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎదుట కూర్చొని ఏ నేత అయినా అలా చేయగలుగుతారా? అని నిలదీస్తున్నారు.

ఉదయం 11.30 గంటలకు హత్య జరిగితే మధ్యాహ్నం 1.15 గంటలకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. అందులో నాలుగో నిందితుడిగా కొల్లు పేరును పెట్టారన్నారు. ఏ విచారణ లేకుండా.. సరైన ఆధారాలు చూపకుండా ఒక మాజీ మంత్రి పేరును నాలుగో నిందితుడిగా ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఘటన మీద ముఖ్యమంత్రి జగన్ మీద తాము ఫిర్యాదు చేస్తామని.. ఎలాంటి విచారణ జరపకుండానే ఆయన పేరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? అన్న తమ ప్రశ్నకు సమాధానం ఇవ్వలని పోలీసు అధికారుల్ని డిమాండ్ చేస్తున్నారు.

మోకాను హత్య చేసిన వ్యక్తులు అదే రోజు సాయంత్రం పెడన పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని.. అదే రోజున వారిని గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారన్నారు. హత్య జరిగిన ఏడు గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుల్ని పట్టుకున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. ఈ నెల రెండున వారిని వాహనాల తనిఖీలో పట్టుకున్నట్లుగా పోలీసు శాఖ పత్రికా ప్రకటన విడుదల చేయటాన్ని వారు తప్పు పట్టారు. రవీంద్ర గోడ దూకి పారిపోయినట్లుగా తప్పుడు ప్రచారం చేశారన్న తెలుగు తమ్ముళ్లు.. రవీంద్రకు హత్యలు చేయించే మైండ్ సెట్ ఉంటే.. ఐదేళ్లు తాను మంత్రిగా ఉండే సమయంలో చేయించేవారు కదా? అని నిలదీస్తున్నారు. మోకా హత్యలో కొల్లు పాత్ర లేకున్నా.. ఆయన్ను బాధ్యుడ్ని చేయటాన్ని తెలుగు తమ్ముళ్లు తప్పు పడుతున్నారు. అధికారపక్ష నేతల్ని.. పోలీసుల తీరుపై అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News