జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు జంప్‌..టీడీపీ టోట‌ల్ ఖాళీ..!

Update: 2019-07-07 11:07 GMT
ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లోనే టిడిపి ఎక్కడ ఎక్కడా ఖాళీ అయిపోతూ వస్తోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరుస పెట్టి ఇతర పార్టీల్లోకి క్యూ కట్టేస్తున్నారు. అలాంటిది 2004 నుంచి అధికారంలో లేని తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఇకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు తెలంగాణలో టీడీపీకి బలం ఉందని ఆ పార్టీ వాళ్లతో పాటు చాలా మంది భావించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 13 చోట్ల పోటీ చేసిన టిడిపి కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకుంది. ఆ ఎన్నిక‌ల్లో టీడిపికి కంచుకోటలుగా ఉన్న శేరిలింగంపల్లి - కూకట్‌ ప‌ల్లి లాంటి చోట్ల ఘోరంగా ఓడిపోయాక తెలంగాణలో టిడిపి పరిస్థితి భూస్థాపితం అయిపోయింద‌న్న క్లారిటీ అంద‌రికి వచ్చేసింది.

తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పూర్తిగా  స్థాపితమైన టిడిపికి ఇప్పటికీ కాస్తో కూస్తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే ఆశలు ఉన్నాయి. ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న ప్రాంతం కావడంతో టిడిపికి ఈ జిల్లాలో కార్యకర్తలు ఉన్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జిల్లాకు ఖాళీ అయిపోతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపితోనే ఉంటున్న మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు టిడిపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) త్వరలోనే బిజెపిలో చేరేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసేందుకు ఆయన వెళ్లారు. త్వరలోనే తన అనుచరులతో చర్చించి పార్టీ మార‌తాన‌ని ఆయన బిజెపి నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో టిడిపి దాదాపు కనుమరుగు అయిపోవడంతో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు గతంలోనే టీఆర్ ఎస్‌ తో పాటు కాంగ్రెస్... బిజెపిల్లో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు సత్యనారాయణ కొత్తగూడెం టిడిపి సీటు ఆశించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన చిన్ని ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా... కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చిన్నికి సీటు దక్కలేదు. ఈ సీటును కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కేటాయించారు. అప్పుడే ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవగా టిడిపి అధినేత చంద్రబాబు ఆయన్ను ప్రత్యేకంగా అమరావతికి పిలిపించి బుజ్జగించారు.

ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన టిడిడీ బోర్డు మెంబ‌ర్‌ గా తీసుకుంటారని ప్రచారం కూడా సాగింది. అటు ఏపీ ఇటు తెలంగాణలో టీడీపీ ప్రాబల్యం తగ్గిపోవడంతో చిన్ని కూడా పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చేశారు. టిడిపిని వీడితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇప్ప‌టికే నామా లాంటి వాళ్లే టీఆర్ ఎస్‌ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు  చిన్ని లాంటి వాళ్లు కూడా వెళ్లిపోతుండ‌డంతో తెలంగాణలో టిడిపికి కాస్తోకూస్తో ఆశలు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిడిపి త్వరలోనే దుకాణం సర్దేస్తుంద‌ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  


Tags:    

Similar News