నో పాలిటిక్స్ అంటున్న టీడీపీ మాజీ మంత్రి...?

Update: 2022-03-21 02:30 GMT
ఆయనకు అంగబలం ఉంది. అర్ధ బలం ఉంది. సమర్ధత కూడా ఉంది. ఇక అధినాయకత్వం ఆయన సేవలను బాగా కోరుకుంటోంది. అయన కలసివస్తే అందలాలే అలా  నడచి వస్తాయి. వాతావరణం కూడా రాజకీయంగా అనుకూలంగా ఉన్న వేళ ఆయన మాత్రం నో పాలిటిక్స్ అనేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నారాయణ. ఆయన చంద్రబాబు టైం లో అయిదేళ్ల పాటు మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు.

ఆయన హయాంలోనే అమరావతి రాజధాని బ్లూ ప్రింట్ తయారైంది. అంతే కాదు, అమరావతి రాజధాని ఎంపిక చేసే కమిటీకి ఆయనే చైర్మన్. సీయార్డీయేకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. నారాయణకు  విద్యా వేత్తగా బాగా  పేరుంది. ఇక పొలిటికల్ గా చూస్తే  ఈసారి ఆయన కచ్చితంగా గెలిచే పరిస్థితులు కూడా ఉన్నాయి.

కానీ నారాయణ మాత్రం నాకు ఈ రాజకీయాలు వద్దు బాబూ అంటున్నారుట. ఆయన గత మూడేళ్ళుగా రాజకీయ సభలకు సమావేశాలకు కూడా హాజరు కావడంలేదు. టీడీపీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఆయన తన విద్యా సంస్థలను అభివృద్ధి చేసే పనిలోనే ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

ఇక తన జీవిత కాలాన్ని విద్యా రంగానికే కేటాయించాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. దీని మీద ఈ మధ్య జిల్లాకు చెందిన ఒక టీడీపీ సీనియర్ నేత నారాయణను కలసి యాక్టివ్ కావాలని కోరగా తనకు ఆసక్తి లేదని చెప్పారని అంటున్నారు.

దీంతో టీడీపీలో చర్చ సాగుతోంది. నారాయణ ఎందుకు అలా వైరాగ్యం తో ఉన్నారని కూడా అంతా చర్చించుకుంటున్నారు. అయితే నారాయణ రాజకీయాలకు కొత్త అయినా ఫస్ట్ టైం వచ్చి కీలకమైన మంత్రిగా పనిచేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేశారు. ఎంత చేసినా కూడా నెల్లూరు అర్బన్ ఓటర్లు ఆయన్ని మూడేళ్ల క్రితం ఓడించారు. దాంతో ఆయన మనస్థాపం చెందారని అంటున్నారు.

దాంతో పాటు తాను అమరావతి రాజధాని కోసం ఎంతో కష్టపడితే దాని మీద వచ్చిన విమర్శలు, ఆరోపణలు అన్నీ కూడా ఆయన్ని తీవ్రంగా కలచివేశాయని అంటున్నారు. అందుకే తనకు లభించిన ఒక్క చాన్స్ తో ఇక రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్లుగానే ఆయన చెప్పేసుకుంటున్నారుట. మొత్తానికి నెల్లూరులో అసలే టీడీపీ కొంత వీక్. అలాంటి చోట సమర్ధుడైన నేత ఇలా రాజకీయాలకు దూరంగా ఉండడం టీడీపీకి ఇబ్బందే అంటున్నారు. చూడాలి మరి ఆయన మనసు మారుతుందో లేదో.
Tags:    

Similar News