ఆరోప‌ణ‌ల‌కు చెక్‌..రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ

Update: 2017-07-10 05:51 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. పార్టీ సీనియ‌ర్ల‌కు అవ‌కాశం ద‌క్క‌డం లేద‌నే ఆరోప‌ణ‌తో పాటుగా ప‌లు వ‌ర్గాల‌కు అన్యాయం చేస్తున్నార‌నే భావ‌న‌ను దూరం చేసేందుకు బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల కోణంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డి - మాజీ మంత్రి  - తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్‌ నేత ఎన్‌ ఎండీ ఫరూఖ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఖరారైందని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

శాసనమండలి చైర్మన్‌ గా ఉన్న చక్రపాణి - చిత్తూరు జిల్లా కు చెందిన మరో నేత పదవీ కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. త‌ద్వారా గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డి - నంద్యాలకు చెందిన ఫరూఖ్‌ ను ఎంపిక చేయాలని చంద్రబాబు సంకల్పించినట్లు తెలుస్తోంది. ఫరూఖ్‌ కు శాసన మండలి చైర్మన్‌ పదవిని కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. నంద్యాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. మంత్రి మండలిలో ముస్లిం మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో కనీసం మండలి చైర్మన్‌ గా ఈ సామాజిక వర్గం వారిని నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆయనకే ఈ మండలి పదవి వరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడం - ఇటీవలే జరిగిన విస్తరణలో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని, మంత్రి పదవి ఇవ్వరాదని గత ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా ఓటమిపాలైన తెదేపా సీనియర్‌ నేత రామసుబ్బారెడ్డి చంద్రబాబును - పార్టీ సీనియర్లను కలిసి కోరిన సంగతి విధితమే. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల కినుక వహించిన రామసుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. విశాఖలో జరిగిన మహానాడుకు కూడా ఆయనతో పాటు జమ్మలమడుగుకు చెందిన కొందరూ పార్టీ సీనియర్లు దూరంగా ఉన్నారు. పరిస్థితి చేయిదాటి పొతుందన్న విషయాన్ని గమనించిన చంద్రబాబు గతవారం రామసుబ్బారెడ్డిని అమరావతికి పిలిపించి సుదీర్ఘమంతనాలు జరిపారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను, మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణాలను చంద్రబాబు వివరించి రామసుబ్బారెడ్డిని శాంతింపచేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ - ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావ్‌ రామసుబ్బారెడ్డితో ప్రత్యేకంగా చర్చించి శాంతింప చేశారు. చంద్రబాబుతో జరిగిన చర్చల సందర్భంగా రామసుబ్బారెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని భ‌రోసా ఇచ్చారు.

అయితే రామసుబ్బారెడ్డిని మండలి చైర్మన్‌గా తనను ఎంపిక చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకుచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. నంద్యా కు చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి వైకాపాలో చేరక ముందు ఆయన సోదరుడు ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణి రెడ్డికి మండలి చీఫ్‌ విప్‌ లేదా  చైర్మన్‌ పదవిని కట్టబెడుతానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం. తీరా మోహ న్‌రెడ్డి పార్టీని వీడటంతో చక్రపాణి రెడ్డికి రెండు పదవుల్లో ఏ పదవి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. తాజాగా ఫరూఖ్‌కు ఎమ్మెల్సీ పదవితో పాటు మండలి చైర్మన్‌ ఇవ్వాలన్న సంకల్పంతో చంద్రబాబు ఉన్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. మంత్రి వర్గంలో చంద్రబాబుతో పాటు 26 మంది సభ్యులు ఉన్నారు. ఇంక కొత్తగా ఎవరిని చేర్చుకునే అవకాశం లేకపోవడం, ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గాన్నే ఎన్నికల దాక కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించడంలో ఫరూఖ్‌కు మండలి చైర్మన్‌ పదవి వరించినట్లయింది.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు దాదాపు 20 మంది పార్టీ సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ సీనియర్‌ నేత, ప్రధానకార్యదర్శి, గృహానిర్మాణ మండలి చైర్మన్‌ వర్ల రామయ్య తాజాగా చైర్మన్‌ పదవిని సాధించిన మాజీ మంత్రులు జే ఆర్‌ పుష్పరాజ్‌, బల్లి దుర్గాప్రసాద్‌ తదితరులు ఆశలు పెట్టుకున్నారు. రెండు పదవులకు అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నంద్యాల శాసన సభా ఉప ఎన్నిక జరుగుతుండటంతో ఈ నియోజక వర్గంలో ముస్లిం మైనార్టీల ఓట్లు కీలకం కావడంతో ఫరూఖ్‌ను ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తద్వార మంత్రి వర్గంలో మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదన్న విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. సోమ‌వారం చంద్ర‌బాబుతో ఫరూక్‌ కలిశాక ఎమ్మెల్సీ ఎంపికపై తేదేపా అధినాయకత్వం ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Tags:    

Similar News