ప్ర‌జ‌ల నాడిని లోకేష్ ప‌ట్ట‌లేక పోతున్నారా..?

Update: 2021-06-25 03:30 GMT
టీడీపీ యువ‌నేత‌, భావి అధ్య‌క్షుడిగా ప్ర‌చారంలో ఉన్న నారా లోకేష్‌.. పెద్ద డోలాయ‌మానంలో ప‌డిపోయారా ? అస‌లు ఆయ‌న ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోలేక పోతున్నారా ? అందుకే ప్ర‌యోగాల పేరిట‌.. ఆయ‌న ప‌డుతూ లేస్తూ ఉన్నారా ? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీకి బ‌ల‌మైన నేత అవ‌స‌రం. అంటే..పార్టీని న‌డిపించేందుకు, పార్టీత‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు.. అధ్య‌క్షపాత్ర పోషించేందుకు ఒక కీల‌క అవ‌స‌రం ఉంది. అది లోకేషేన‌ని.. చంద్ర‌బాబు స‌హా సీనియ‌ర్ల‌కు తెలిసినా.. పైకి చెప్ప‌లేక పోతున్నారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. పార్టీలోనే ఓ వ‌ర్గం నేత‌లు.. లోకేష్‌ను అధ్య‌క్షుడిగా ఊహించ‌లేక‌పోతున్నారు. ఆయ‌న‌కు మాట్లాడ‌డ‌మే స‌రిగారాదు.. ఇంక పార్టీనేం న‌డిపిస్తారు ? అనే వారు స‌హా.. ఆయ‌నే గెల‌వ‌లేదు.. పార్టీని గెలిపిస్తారా ? అనే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో లోకేష్ తీవ్ర మాన‌సిక వేద‌న అనుభ‌విస్తున్నార‌నేది వాస్త‌వం. దీంతో త‌న‌ను తాను నిరూపించుకునేందుకు చాలానే క‌ష్ట‌ప‌డుతున్నారు. ఆహారం త‌గ్గించి వ్యాయామం చేసి.. ఆహార్యంలో మార్పులు చేసుకున్నారు. అయినా మార్కులు ప‌డ‌లేదు.

ఇక‌, గ‌డ్డం పెంచారు.. నిత్యం నాయ‌కుల‌కుఅందుబాటులో ఉంటున్నారు. అయినా కూడా ఎక్క‌డా ఊపు ల‌భించ‌డం లేదు. దీంతో వాయిస్ జోరు పెంచారు. ఇప్పుడు ఎక్క‌డ మాట్లాడినా.. ఎలా మాట్లాడినా.. వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. పీకుతారా, లాగుతారా ?  దొంగ‌లు.. ఇలా.. అనేక వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వీటిలో కొన్ని కొన్ని సార్లు రాయ‌డానికి కూడా వీలులేని భాష‌నే వాడుతున్నారు. ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో అయితే రారా అని సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.

అయితే.. ఇదంతా మాస్ ఇమేజ్ కింద‌కు వ‌స్తుంద‌ని.. మాస్‌ను ఆక‌ట్టుకునేందుకు లోకేష్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. కానీ, ఇంత చేసినా.. లోకేష్‌కు మార్కులు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి లోకేష్ ఆశిస్తున్న‌ట్టు.. జ‌రిగేది ఎప్పుడు..? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది.
Tags:    

Similar News