జగన్ ప్రభం 'జనం'...తమ్ముళ్లలో ఆందోళన

Update: 2019-01-10 04:49 GMT
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభంజనంగా ముగిసింది. పాదయాత్ర ముగింపునకు వచ్చిన జనంతో తెలుగు తమ్ముళ్లలో బేజారు ప్రారంభమైంది. పాదయాత్ర ముగింపు సభ జరిగిన ఇచ్ఛాపురం ఆంధ్రప్రదేశ్ - ఒడిసా రాష్ట్రాలకు సరిహద్దు పట్టణం. ఇక్కడి జనాభా కూడా పెద్ద ఎక్కువేం కాదు. అయినా ఇచ్చాపురం అంతా ప్రజలతో నిండిపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా కోస్తా - రాయలసీమ జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ ప్రభం"జనం" రానున్న ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సంకేతమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. చిన్న పట్టణంలో లక్షలాది మంది ప్రజలు రావడం - అది కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్రమశిక్షణతో ఉండడం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి - ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను తెలియజేస్తోందని అంటున్నారు. కడప జిల్లా పులివెందులలో ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియడంతో ఆంధ్రప్రదేశ్ అంతటా జగన్ పర్యటించినట్లు అయ్యింది. ఈ పాదయాత్రకు గతంలో ఏ నాయకుడు చేసిన పాదయాత్రకు సంబంధం లేదని - ఇది మహాపాదయాత్ర అని రాజకీయ పండితులు అంటున్నారు.

ఏ జిల్లాలో పాదయాత్ర చేసినా మహిళలు - యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారని - వీరితో పాటు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి జగన్ కు మద్దతు పలికారని అంటున్నారు. " ఈ పాదయాత్రకు వచ్చిన వారిని చూస్తే అధికార తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధం అవుతోంది" అని రాజకీయ విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించారు. పాదయాత్రకు ప్రజలు వచ్చిన తీరు ఒకటైతే... ఈ యాత్రలో జగన్ చేసిన వాగ్దానాలు - హామీలు మరో ఎత్తు అని వారంటున్నారు. ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్ అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే హమీ ఇస్తానని ప్రకటించడం జగన్ పరిణితికి ప్రతీక అని అంటున్నారు. "ఓట్ల కోసం ఏ హామీ పడితే అది ఇవ్వకుండా తనకు సాధ్యం కాని అంశాలను ఎన్నికల ముందే ప్రకటించడం జగన్ లోని రాజకీయ పరిణితికి నిదర్శనం" అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వడం పట్ల కాపు యువకుల్లో కూడా జగన్ పట్ల ఓ నమ్మకం కలిగిందంటున్నారు. అధికారంలోకి వచ్చే వరకూ ఓ మాట - వచ్చిన తర్వాత ఓ మాట చెప్పడం చంద్రబాబు నైజమని తేలిపోయిందని అంటున్నారు.  జగన్ తన పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత చేరవయ్యారంటున్నారు.


Full View

Tags:    

Similar News