ప్రిన్స్ పై తెలుగు 'త‌మ్ముళ్ల' గుర్రు!

Update: 2017-09-29 18:48 GMT
టాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ ప్రిన్స్ మ‌హేష్ బాబుకు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. వివాద ర‌హితుడిగా, రాజ‌కీయాల‌కు దూరంగా ఉండే వ్య‌క్తిగా టాలీవుడ్ లో మ‌హేష్ కు పేరుంది. మ‌హేష్‌ తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ గ‌తంలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. మ‌హేష్ బావ గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఏ ఎన్నిక‌ల సంద‌ర్భంలోనూ ప్రిన్స్ ఏ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం నిర్వ‌హించ‌లేదు. క‌నీసం, ఫ‌లానా పార్టీకి మ‌ద్ద‌తు తెలుపులున్నాన‌ని కూడా ప్ర‌క‌టించ‌లేదు. త‌న‌కు రాజ‌కీయాలు స‌రిప‌డ‌వ‌ని, భ‌విష్య‌త్తులో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని చాలా సంద‌ర్భాల్లో మ‌హేష్ చెప్పాడు. అయితే, తాజాగా స్పైడర్ ప్రమోషన్‌లో భాగంగా ప్రిన్స్ ను  రోజా ఇంట‌ర్వ్యూ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇంట‌ర్వ్యూలో వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మ‌హేష్ చేసిన వ్యాఖ్యలు తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. వారిద్ద‌రూ గొప్ప‌నాయ‌కులంటూ మ‌హేష్ మెచ్చుకోవ‌డం తెలుగు త‌మ్ముళ్లకు అస‌లు న‌చ్చ‌లేద‌ట‌.

స్పైడర్ మూవీ ప్ర‌మోష‌న్ లో భాగంగా మ‌హేష్ సాక్షి టీవీకి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ను వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట‌ర్వ్యూ చేశారు. గతంలో ఖైదీ నెంబర్ 150 సినిమా విడుద‌ల‌ సంద‌ర్భంగా చిరంజీవిని కూడా రోజా ఇంటర్వ్యూ చేశారు. అదే త‌ర‌హాలో మహేష్ తో ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా వైఎస్ గురించి మీ అభిప్రాయం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. నాన్న‌గారికి వైఎస్ గారితో మంచి సంబంధాలున్నాయ‌ని, ఆయ‌నంటే నాన్న‌గారికి చాలా ఇష్ట‌మ‌ని మ‌హేష్ చెప్పారు. గతంలో తాను వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశానని, ఆ సమయంలో జగన్ కూడా ఉన్నారని బ‌దులిచ్చారు. వైయస్, జ‌గ‌న్ లు అమేజింగ్ లీడ‌ర్స్ అని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.
 
కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా మ‌హేష్ అభిమాన సంఘాలు వైసీపీకి మద్దతు తెలిపిన‌ట్లు వార్తలు వచ్చాయి. ఇపుడు ఏకంగా  జగన్, వైయస్ ల‌ను మ‌హ‌ష్ మీడియా సాక్షిగా పొగడటంపై టీడీపీలో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. రోజా అనుకోకుండా అడిగిన ప్ర‌శ్న‌కు మహేష్‌ బ‌దులిస్తూ వైఎస్‌, జ‌గ‌న్ లను మెచ్చుకోవ‌డం తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదని వినికిడి. అస‌లు టీడీపీపై నిప్పులు చెరిగే రోజా మ‌హేష్ ను ఇంట‌ర్వ్యూ చేయ‌డం, అందులో ఆమె అడిగిన ప్ర‌శ్న‌కు మహేష్ ఈ ర‌కంగా సమాధాన‌మివ్వ‌డం వారికి అస‌లు న‌చ్చ‌లేద‌ట‌. ప్రిన్స్ ఈ ర‌కంగా వ్యాఖ్యానించ‌డంతో తెలుగు తమ్ముళ్లు అస‌హ‌నానికి గుర‌య్యార‌ని టాక్‌. అయినా, మ‌హేష్ త‌న అభిప్రాయాన్ని బాహాటంగా వెల్ల‌డించారు. ఇందులో దాప‌రిక‌మేమీ లేదు. నిజంగా వైఎస్‌, జ‌గ‌న్ లు గొప్ప నాయ‌కులు. అదే అభిప్రాయాన్ని మ‌హేష్ కూడా వెలిబుచ్చారు.  అదే ఇంట‌ర్వ్యూలో తాను భ‌విష్య‌త్తులో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని కూడా స్ప‌ష్టం చేశాడు. ప్రిన్స్ ఇంత క్లారిటీ ఇచ్చినా తెలుగు త‌మ్ముళ్ల ఉలికిపాటుకు కార‌ణ‌మేమిటో తెలియ‌ని ప‌రిస్థితి. అయినా, గొప్ప నాయ‌కుల‌ను గొప్ప వార‌ని ఒప్పుకునే పెద్ద మ‌న‌సు అంద‌రికీ ఉండడు కదా. అందుకేనేమో, ఉన్న‌మాటంటే ఉలుకెక్కువ అన్నారు పెద్ద‌లు!

Full View
Tags:    

Similar News