ఆయ‌న లేడుగా.... క‌డ‌ప త‌మ్ముళ్ల ఖుషీ!

Update: 2022-12-07 11:46 GMT
క‌డ‌ప జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కులు ఇప్పుడు తెగ సంబర‌ప‌డిపోతున్నారు. వీరి సంతోషానికి కార‌ణం అధికార పార్టీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ కాదు, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు కాదు. మ‌రి క‌డ‌ప తెలుగు త‌మ్ముళ్ల సంతోషానికి కార‌ణ‌మెవ‌రంటే ఆ జిల్లాకే చెందిన ప్ర‌ముఖ నాయ‌కుడు సీ.ఎం. ర‌మేష్‌. ఆయ‌న‌కు క‌డ‌ప జిల్లా తెలుగు త‌మ్ముళ్ల సంతోషానికి సంబంధమేంట‌ని ఆరా తీస్తే తెలుగు తమ్ముళ్లు చెబుతున్న స‌మాధానం విస్తుగొలుతోంది.

హ‌మ్మ‌య్యా... ఈ సారి ఆయ‌న (సీ.ఎం.ర‌మేష్‌) మా పార్టీలో లేరు. ఈ సారి పార్టీ టికెట్ల కోసం మా తంటాలేవో మేం ప‌డొచ్చు. ఆయ‌నుంటే అంద‌రికీ అడ్డ‌మే. చంద్ర‌బాబు ఆయ‌న్ను అడిగే అంద‌రికీ టికెట్లు ఇచ్చేవారు. ఇప్పుడా బెడ‌ద లేదుగా అంటూ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సీఎం ర‌మేష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయ‌న టీడీపీలో పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కుడిభుజంలాగా వ్య‌వ‌హ‌రించేవారు. ఇక క‌డ‌ప జిల్లాల్లో సీఎం ర‌మేష్ ఆధిప‌త్యానికి తిరుగుండేది కాదు. ఈ జిల్లాలో ఎవ‌రికి టిక్కెట్ ఇవ్వాల‌న్నా చంద్ర‌బాబు సీఎం ర‌మేష్‌ను సంప్ర‌దించ‌కుండా ఇచ్చేవారు కారు. అలా అన‌డం కంటే ఒక‌రంగా సీఎం ర‌మేష్ చెప్పిన వారికే టికెట్లు ఇచ్చేవారు. అలా ఉండేది వ్య‌వ‌హారం. దాంతో టికెట్ ఆశించే చాలా మంది నాయ‌కుల‌కు సీఎం ర‌మేష్ అప్ప‌ట్లో కంట్లో న‌లుసులా ఉండేవారు.కానీ ఆయ‌నకు ఎదురు చెప్పే సాహ‌సం  ఎవ‌రికీ ఉండేది కాదు.

ఆ స్థాయిలో సీఎం ర‌మేష్ అన్నీ తానై చ‌క్రం తిప్పేవారు. ఆయ‌న ధాటికి త‌ట్టుకోలేక అప్ప‌ట్లో పెద్ద పెద్ద నాయ‌కులు కూడా రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ఇర‌త పార్టీల‌వైపు చూసిన సంద‌ర్భాలున్నాయి. జిల్లాలో పార్టీ ఎన్నిక‌ల ఖ‌ర్చు అంతా సీఎం ర‌మేష్ భ‌రిస్తుండ‌టంతో ఆయ‌న మాటే చెల్లుబాటు అయ్యేది. జ‌మ్మ‌ల‌మ‌డుగు టికెట్ ఆదినారాయ‌ణ‌రెడ్డికి కాద‌ని సీఎం ర‌మేష్ ఒత్తిడితో రామ‌సుబ్బారెడ్డికి ఇచ్చారు. తీరా ఎన్నిక‌ల‌య్యాక రామ‌సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీలో చేరారు.

ప్రొద్దుటూరు విష‌యంలో నంద్యాల వ‌ర‌ద‌రాజుల రెడ్డి టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తే ఆయ‌న‌కు కాద‌ని మ‌ల్లెల లింగారెడ్డికి ఇచ్చారు. ఇందులోనూ సీఎం ర‌మేష్‌దే ప్ర‌ధాన పాత్ర‌ని తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నారు. త‌న‌కు టికెట్ రాక‌పోవ‌డానికి సీఎం ర‌మేషే కార‌ణ‌మ‌ని వ‌ర‌ద‌రాజులు రెడ్డి ఆ స‌మ‌యంలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు కూడా చేశారు.  ఇన్నీ చేస్తే పార్టీ ఓడిపోయాక సీఎం ర‌మేష్ కూడా ప్లేటు పిరాయించేసి క‌మ‌ల‌ద‌ళంలో చేరిపోయారు.

ఇప్పుడు క‌డ‌ప జిల్లా టీడీపీలో సీఎం ర‌మేష్ ప్రాబ‌ల్యం త‌గ్గింద‌ని తెలుగు త‌మ్ముళ్లు సంతోష‌ప‌డుతున్నారు. ఈ సారి జిల్లాల్లో టీడీపీ టికెట్లు రాబిన్ శ‌ర్మ చేసే స‌ర్వే ఆధారంగా పార్టీ కేటాయించ‌నుండ‌టంతో ఈ స‌ర్వేలో మంచి మార్కులు తెచ్చుకోవ‌డానికి టీడీపీ నేత‌లు తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు.  నాయ‌కులు కూడా క్షేత్ర‌స్థాయిలో త‌మ ప్రాబ‌ల్యం పెంచుకునేలా క‌ర్య‌క్ర‌మాలు చేప‌ట్టి స‌ర్వేలో త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్కేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 కేవలం డబ్బులు పెడతారనే కారణంతో బలహీనమైన వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెడితే గత ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో ప్రత్యక్షంగా అనుభవమైందని, జిల్లాలోని పది స్థానాలు వైసీపీకి అప్పగించేలా చేశారంటూ విమర్శలు వచ్చాయి. ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు లభిస్తాయని నేతలంతా ఆశాభావంతో ఉన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News