జ‌గ‌న్ కంటే ఆ టీడీపీ నేతల ఆస్తులే ఎక్కువ‌!

Update: 2019-03-23 08:45 GMT
ఎన్నిక‌ల పుణ్య‌మా అని ప‌లువురు నేత‌ల ఆస్తుల లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మిగిలిన వేళ‌ల్లో వారి ఆస్తుల‌కు సంబంధించిన వివ‌రాలు ఒక్క‌టి కూడా బ‌య‌ట‌కు రావు. తాజాగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులు త‌మ ఆస్తులు.. అప్పులు.. బ్యాంకు అకౌంట్ నెంబ‌ర్ల‌తో స‌హా వివ‌రాలు బ‌య‌ట‌కు వెల్ల‌డిస్తున్న వేళ‌.. వారి ఆస్తుల లెక్క‌లు క‌ళ్లు చెదిరేలా ఉన్నాయి. అయితే.. ఇవ‌న్నీ అధికారికంగా చెప్పే లెక్క‌లు.

కొంద‌రు నేత‌లు త‌మ ఆస్తుల విలువ‌కు సంబంధించిన‌లెక్క‌లు చూసిన‌ప్పుడు అవాక్కు అవ్వాల్సిందే. ఇంత త‌క్కువ‌గా లెక్క క‌డితేనే.. ఆస్తులు ఈ స్థాయిలో ఉంటే.. బ‌హిరంగ మార్కెట్ లో ఉన్న విలువ‌తో మ‌దింపు చేస్తే.. నేత‌ల ఆస్తుల లెక్క‌లు మొత్తంగా మారిపోతాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆస్తుల విష‌యంలోకి వ‌స్తే.. అనునిత్యం ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి తెలుగు త‌మ్ముళ్లు చేసే విమ‌ర్శ‌లు అన్ని ఇన్ని కావు. ల‌క్ష కోట్లు అని చెబుతూ జ‌గ‌న్ మీద ప‌డిపోయే టీడీపీ అధినేత మాట‌ల‌కువాస్త‌వానికి మ‌ధ్య తేడా తాజాగా వెలువ‌డిన ఆస్తుల లెక్క‌లు చెప్పాయ‌ని చెప్పాలి.

అధికారికంగా జ‌గ‌న్ ఆస్తుల విలువ రూ.339 కోట్లు ఉంటే.. దీనికి మించిన ప‌లువురు తెలుగు త‌మ్ముళ్ల ఆస్తుల విలువ ఉండ‌టం విశేషం. ఇక‌.. బాబు ఆస్తులు అయితే కేవ‌లం రూ.20 కోట్ల‌కు ప‌రిమితం చేయ‌టం విశేషం. జ‌గ‌న్ ఆస్తుల‌తో పోలిస్తే.. టీడీపీకి చెందిన ప‌లువురు నేత‌ల ఆస్తులు భారీగా ఉన్న‌ట్లు తాజాగా దాఖ‌లు చేసిన ఆఫిడ‌విట్లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

జ‌గ‌న్ కంటే ఎక్కువ‌గా టీడీపీ అభ్య‌ర్థుల‌గా బ‌రిలోకి దిగిన మంత్రి నారాయ‌ణ ఆస్తి రూ.668 కోట్లుగా ప్ర‌క‌టించారు. ఈ మొత్తం జ‌గ‌న్ ఆస్తుల కంటే చాలా ఎక్కువ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. మంత్రి నారాయ‌ణ ఆస్తులు జ‌గ‌న్ ఆస్తుల కంటే రెట్టింపుగా చెప్పాలి.

ఏపీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల్లో ఆస్తుల లెక్క భారీగా ఉన్న అభ్య‌ర్థుల్లో గ‌ల్లా జ‌య‌దేవ్‌.. విజ‌య‌వాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన పొట్లూరి వ‌ర ప్ర‌సాద్ ఆస్తులు రూ.347.75 కోట్లుగా.. టీడీపీ ఎంపీ అభ్య‌ర్థి కేశినేని శ్రీ‌నివాస్ ఆస్తులు మొత్తం రూ.80.82 కోట్లుగా పేర్కొన్నారు. ఇలా ప‌లువురి ఆస్తులు భారీగా ఉండ‌టం గ‌మ‌నార్హం.  


Tags:    

Similar News