ఆ ఒక్కటి తప్ప..అంటున్న ఏపీ తమ్ముళ్లు

Update: 2016-10-18 08:35 GMT
రాజకీయ నాయకులు.. మీడియా ప్రతినిధులకు మధ్యనున్న సంబంధాల గురించి కాస్త చెప్పాల్సిందే. ఇప్పుడంటే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది కానీ.. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. మీడియా ప్రతినిధుల్ని తమకు అత్యంత నమ్మకస్తులుగా నేతలు భావించేవారు. అదే సమయంలో మీడియా ప్రతినిధులు సైతం.. సమాజానికి ఏదో మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ రంగానికి రావటంతో తాము కలిసే నేతలకు ఫీడ్ బ్యాక్ రూపంలో సలహాలు.. సూచనలు ఇస్తుండేవారు. సొంత లాభం గురించి అస్సలు పట్టించుకునే వారు కాదు. అలా అని మీడియా మొత్తం సుద్దపూసలుగా ఉండేవారని చెప్పటం లేదన్నది మర్చిపోకూడదు.

ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావటానికి 24 గంటల టీవీ ఛానళ్లుగా చెప్పాలి. ఆ తర్వాతి కాలంలో పాత్రికేయాన్ని వృతి కన్నా కూడా దాన్నో.. ఉద్యోగంగా చూసే వారు పెరిగారు. గతంలో పాత్రికేయుడంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి అన్న అభిప్రాయం నుంచి.. పవర్ ను చూపించే వ్యక్తిగా మారిపోయిన పరిస్థితి. రోజులు గడిచే కొద్దీ వెల్లువలా వచ్చిన మీడియా సంస్థలతో.. పాత్రికేయుల అవసరం పెరిగిపోవటం.. ఎంపికలో చోటు చేసుకున్న తొందరపాటు పరిస్థితుల్ని పూర్తిగా మార్చేశాయని చెప్పాలి.

దాదాపు పన్నెండేళ్ల కిందట ఏదైనా సమస్య గురించి పాత్రికేయులు వెళితే.. తమ సమస్యలు తీరుతాయన్న భావనతో స్పందించే ప్రజలు ఇప్పుడు.. సందేహంగా చూసేలా పరిస్థితి దిగజారింది. ఇందుకు తగ్గట్లే నేతలకు.. పాత్రికేయులకు మధ్య సంబంధాలు కూడా కాస్త తగ్గాయని చెప్పాలి. ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉండే నేతలు సీనియర్ పాత్రికేయులకు అంతోఇంతో ప్రాధాన్యత ఇస్తున్నారనే చెప్పాలి. కాకుంటే.. గతంలో నమ్మినంతగా ఇప్పుడు నమ్మటం లేదన్నది చేదు నిజం. ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి విజయవాడకు సమీపంలోని కేఎల్ యూనివర్సిటీలో పార్టీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులకు ఆయన ఏడు పేజీలున్న సీల్డ్ కవర్ ఇచ్చారు.

అందులోని విషయాలు బయటకు రాకుండా ఉంటే మంచిదన్న మాటను చెప్పారు. ఇలాంటి మాటలు చెప్పటం.. నాలుగు రోజులకే అందులోని విషయాలు బయటకు వచ్చే పరిస్థితి. ఆసక్తికరంగా ఈసారి మాత్రం సీల్డ్ కవర్ కు సంబంధించిన అంశాలు బయటకు పొక్కకపోవటం ఆసక్తికరంగా మారింది. పలువురు సీనియర్ జర్నలిస్టులు తెలుగు తమ్ముళ్లతో మాట్లాడినా.. వారు మిగిలిన విషయాల మీద మాట్లాడేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నా.. సీల్డ్ కవర్ ముచ్చట వచ్చిన వెంటనే మాత్రం.. ఆ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పటం గమనార్హం.  మీడియాతో క్లోజ్ గా ఉండే ప్రజాప్రతినిధులు మాత్రం సీల్డ్ కవర్ లోని ప్యీడ్ బ్యాక్ గురించి మాత్రం పెదవి విప్పేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదన్న వాదన ఉంది. తెలుగు తమ్ముళ్లకు సంబంధించిన కంప్లీట్  స్కానింగ్ రిపోర్ట్ గా పేర్కొంటున్న ఈ నివేదికలో బలాల కంటే బలహీనతల గురించి.. ఒప్పుల కంటే తప్పుల మీద.. విమర్శల మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. అందుకే.. నేతలు ఎవరూ సీల్డ్ కవర్ లోని అంశాలపై చర్చించటానికి సుముఖత వ్యక్తం చేయటం లేదన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News