బాబు ఓట‌మిని ప్ర‌కృతి డిసైడ్ చేసిందా?

Update: 2018-05-01 04:49 GMT
కొన్ని సంద‌ర్భాల్ని ప్ర‌కృతి ముందే చెప్పేస్తుంది. కొంద‌రు న‌మ్మ‌రు కానీ.. జ‌రుగుతున్న ఉదంతాల్ని చూస్తే టీడీపీ అధినేత చంద్ర‌బాబు రానున్న రోజుల్లో తీవ్ర ప్ర‌తికూల‌త‌ను ఎదుర్కొన‌బోతున్నారా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది.  నాలుగేళ్లు మోడీ ఏం చేసినా జీ హుజూర్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు ఆయ‌న‌పైన తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

మోడీపై ఇంత తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్న బాబును గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేదంటున్నారు. ఎన్నిక‌ల‌కు ఏడాది కంటే త‌క్కువ స‌మ‌యం వ‌చ్చేసిన‌ప్పుడు ముఖ్య‌నేత‌ల నోటి మాట‌ల్లో మార్పు రావ‌టం మామూలే. అందుకు చంద్ర‌బాబు నాయుడు సైతం మిన‌హాయింపు కాదు. భారీ అవినీతి.. మాట మీద నిల‌బ‌డ‌క‌పోవ‌టం.. ఇచ్చిన హామీల అమ‌లు విష‌యంలో చేసిన త‌ప్పుల‌కు ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ప్ర‌జ‌లే కాదు.. ప్ర‌కృతి కూడా బాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉందా? అంటే అవున‌న్నట్లుగా ఉంది ప‌రిస్థితి.  నిన్న (సోమ‌వారం) తిరుప‌తిలో నిర్వ‌హించిన ధ‌ర్మ‌యుద్ధం కార్య‌క్ర‌మానికి కొద్దిగా ముందు ప్ర‌చండ గాలులు ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో కొత్త అంత‌ర్మ‌ధ‌నానికి తెర తీశాయి. నిన్న‌టికి నిన్న హ‌డావుడిలో పెద్ద‌గా ప‌ట్ట‌లేదు కానీ.. త‌ర‌చి చూస్తున్న వారు ఇప్పుడు విప‌రీత‌మైన భ‌యాందోళ‌న‌ల‌కు గురి అవుతున్నారు.

అప్ప‌టివ‌ర‌కూ మండిన ఎండ‌లు కాస్తా ఒక్క‌సారిగా మారిపోవ‌టం.. గాలి బీభ‌త్సం తిరుప‌తి ప్ర‌జ‌ల్ని అవాక్కు అయ్యేలా చేసింది. ప్ర‌చండ గాలులతో ధ‌ర్మ‌యుద్ధం స‌భ ద‌గ్గ‌ర గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితే 2004 ఎన్నిక‌ల ముందు చోటు చేసుకోవ‌టాన్ని ప‌లువురు గుర్తు చేసుకుంటున్నారు.

అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌తో ఏపీ ప్ర‌జ‌లు బాబు స‌ర్కారును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌లో వైఎస్ ఛ‌రిష్మాను దెబ్బ తీసేలా.. త‌మ‌కు తిరుగులేద‌న్న విష‌యాన్ని చాటాల‌న్న ఉద్దేశంతో తిరుప‌తిలో ప్లీన‌రీ నిర్వ‌హించేందుకు భారీ ఎత్తున స‌న్నాహాలు చేసింది. ప్లీన‌రీకి రెండు రోజుల ముందు ఉన్న‌ట్లుండి భారీ ఎత్తున ఈదురుగాలులు.. పెద్ద వ‌ర్షం ప‌డింది. దాంతో.. అప్ప‌టివ‌ర‌కూ చేసిన ఏర్పాట్లు మొత్తం వ‌ర్షానికి కొట్టుకుపోయాయి.

దీన్నో అప‌శ‌కునంగా  కొంద‌రు టీడీపీ నేత‌లు భావిస్తే.. మ‌రికొంద‌రు మాత్రం దాన్నో శుభ‌సూచ‌కంగా ఫీల‌య్యారు.

క‌ట్ చేస్తే.. మ‌ళ్లీ ఇన్నాళ్ల త‌ర్వాత అలాంటి దృశ్య‌మే చోటు చేసుకోవ‌టాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. గ‌తంలో మాదిరి ఈసారి కూడా తిరుప‌తిలోనే ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని.. స‌భ‌కు ముందు ప్ర‌కృతి ప్ర‌కోపంతో చోటు చేసుకున్న గంద‌ర‌గోళం.. ఏర్పాట్లు ప్ర‌భావితం కావ‌టం చూస్తే.. 2019 నాటి ఎన్నిక‌ల్లో టీడీపీకి అప‌జ‌యం త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని ప్ర‌కృతి చెప్పేసింద‌ని చెబుతున్నారు.

ఈ విశ్లేష‌ణ చేస్తున్న వారి నోటి నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. తొమ్మిదిన్న‌రేళ్లు నాన్ స్టాప్ గా అధికారాన్ని చేప‌ట్టిన చంద్ర‌బాబు.. తిరుమ‌లలో అభివృద్ధి పేరుతో తొల‌గించిన ప్రాచీన క‌ట్ట‌డాల‌పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. శ్రీ‌వారికి కోపం వ‌చ్చింద‌ని.. ఆయ‌న ఆగ్ర‌హమే బాబుకు శాపంగా మారింద‌న్న మాట అప్ప‌ట్లో వినిపించింది. తాజాగా టీటీడీ బోర్డు ఏర్పాటు విష‌యంలో కొంద‌రి స‌భ్యుల ఎంపిక విష‌యంలో బాబు చేసిన త‌ప్పుల‌పై శ్రీ‌వారికి కోపం వ‌చ్చి ఉంటుంద‌ని.. ఆ విష‌యాన్ని రుజువు చేసేలా ప్ర‌కృతి  ప్ర‌కోపం ఆవిష్కృత‌మైందంటూ కొంద‌రు సీనియ‌ర్ టీడీపీ నేత‌లు చేస్తున్న విశ్లేష‌ణ‌లు పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.


Tags:    

Similar News