అంత‌క‌ష్ట‌ప‌డుతున్నా లీస్ట్ ర్యాంకులేనా!

Update: 2016-10-29 11:30 GMT
ఏపీలో సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల‌పై ఇటీవ‌లే ప్ర‌త్యేకంగా ఓ నిఘా స‌ర్వే చేయించారు. పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టి.. దాదాపు రెండున్న‌రేళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో వారి వారి ప‌నితీరు ఎలా ఉంది. ప్ర‌జ‌ల‌తో ఎలా మ‌మేకం అవుతున్నారు. బంధు ప్రీతి ఎలా ఉంది? ఎమ్మెల్యేలు ఎలాంటి దందాలు చేస్తున్నారు? 2019 ఎన్నిక‌ల నాటికి వీరి ప‌రిస్థితి ఎలా ఉంటుంది?  ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఎలా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్తున్నారు? వ‌ంటి అనేక‌ అంశాల‌పై ఆయ‌న స‌ర్వే చేయించారు. దీనికి సంబంధించి వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా ఆయా నేత‌ల‌కు బాబు గ్రేడ్‌ లు క‌ట్ట‌బెట్టారు. ఏ - బీ - సీ - డీ గ్రేడ్ల‌ను కేటాయించారు. ఇటీవ‌ల ఈ గ్రేడ్‌ ల‌తో కూడిన నివేదిక వివ‌రాల‌ను ఎమ్మెల్యేలు - మంత్రుల‌కు స్వ‌యంగా షీల్డు క‌వ‌ర్ల‌లో అందించిన చంద్ర‌బాబు.. ఆయా వివ‌రాల‌ను ర‌హ‌స్యంగా ఉంచ‌మ‌న్నారు.

ఈ వివ‌రాలు తెరిచి చూసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితుల‌ను ఈ నివేదిక‌లు స్ప‌ష్టం చేశాయ‌ట‌. అంతేకాదు, త‌మ బంధువులు ఎలాంటి దందాలు చేస్తున్నారో కూడా దానిలో వివ‌రించార‌ట‌. అయితే, ఈ స‌ర్వేలో కొన్ని పొర‌పాట్లు కూడా దొర్లాయ‌ట‌. నిజంగానే నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌ష్ట‌ప‌డుతున్న ఎమ్మెల్యేల విష‌యంలో కూడా నివేదిక‌లో రాంగ్‌ స‌మాచారం పోందుప‌రిచార‌ట‌. దీంతో ఆయా ఎమ్మెల్యేలు అవాక్క‌వుతున్నారు. ముఖ్యంగా విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే.. గ‌ద్దె రామ్మోహ‌న్‌ టీడీపీలో సీనియ‌ర్ నేత‌. గ‌తంలో ఎంపీగా కూడా గెలుపొందారు.

అయితే, ఈయ‌న‌పై బ్యాడ్ రిపోర్ట్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డమే కాకుండా వార్డుల్లోనూ క‌లియ‌దిరుగుతూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఈయ‌న‌పై స‌ర్వేలో లోపాలు వ‌చ్చాయి. రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధ జడ్పీటీసీ చైర్ పర్సన్‌ గా ఉన్నప్పటికీ జడ్పీ నుంచి నిధులు తీసుకురావటం లేదంటూ సర్వేలో పేర్కొన్నారు. జిల్లా పరిషత్ నిధులు గ్రామాలకే గాని, నగరాలకు ఇవ్వరు. ఈ విష‌యం తెలియ‌క స‌ర్వేలో రాంగ్ రిపోర్టు ఇచ్చారు.

అదేవిధంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి ఆ జిల్లాలో మంచి పేరు ఉంది. నియోజకవర్గంలో ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు. పనులు కూడా వేగిరం చేయిస్తారు. తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్న పది సంవత్సరాలపాటు అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. సర్వే నివేదికలో హనుమంతరాయ చౌదరి నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధ ఫలితమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  

మ‌రి ఇంత‌లా స‌ర్వేలు ఎందుకు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చాయ‌నే విష‌యంపై ఇప్పుడు ఆయా ఎమ్మెల్యేలు జుట్టు పీక్కుంటున్నారు. తాము నిజంగానే ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నామ‌ని, అయినా.. త‌ప్పుడు నివేదిక‌లు వ‌చ్చాయ‌ని వారంతా వాపోతున్నారు. కొంద‌రు ఎమ్మెల్యేలు స‌ర్వేలో వ‌చ్చిన రాంగ్ రిపోర్టుల‌పై చంద్ర‌బాబును క‌లిస్తే వాటిని అక్క‌డితో వ‌దిలేసి మీ ప‌ని మీరు చూసుకోండి అని స‌ర్ది చెప్పి పంపుతున్నార‌ట‌.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News