ఉన్న‌వి స‌రిపోన‌ట్లు బాబుకు తార‌క్ త‌ల‌నొప్పి పెరిగింద‌ట‌!

Update: 2019-03-12 12:07 GMT
పేరుకు అధికార పార్టీనే కానీ.. పార్టీకి చెందిన నేత‌ల్లో ప‌లువురికి ప‌ట్టుమ‌ని ప‌ది నిమిషాలు ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునేలా మాట్లాడే స‌త్తా లేద‌న్న విమ‌ర్శ త‌ర‌చూ టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి చెబుతుంటారు. తాజాగా జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో గ‌తంలో ఎప్పుడూ లేనంత హోరాహోరీగా సాగనున్న వేళ‌.. టీడీపీ అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయ‌ట‌. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

ఓవైపు ప్ర‌జా వ్య‌తిరేక‌త‌.. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఇది స‌రిపోన‌ట్లు ఇప్ప‌టికే పార్టీ నుంచి జంప్ అయిన ప‌లువురు నేత‌ల కార‌ణంగా గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని త‌మ్ముళ్లు ఆవేద‌న చెందుతున్నారు. వీట‌న్నిటికి తోడు కేంద్ర ఎన్నిక‌ల సంఘం జారీ చేసిన నోటిఫికేష‌న్ లో తొలిద‌శ‌లోనే పోలింగ్ కు డేట్ ఫిక్స్ చేయ‌టంతో.. త‌క్కువ వ్య‌వ‌ధిలోనే అన్ని ప‌నులు పూర్తి చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

గ‌డిచిన ప‌దిహేను ఏళ్లుగా చూస్తే.. ఏ రోజు కూడా తొలి ద‌శ‌లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగిన ప‌రిస్థితి లేదు. అందుకు భిన్నంగా ఈసారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం.. అర్జెంట్ గా ఎన్నిక‌లు.. ఆల‌స్యంగా ఫ‌లితాలు వెలువ‌డుతున్న చిత్ర‌మైన ఎన్నిక‌లుగా ఏపీ నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు.

గ‌ట్టిగా నెల రోజులు కూడా వ్య‌వ‌ధి లేని వేళ‌.. టీడీపీ త‌ర‌ఫున స్టార్ క్యాంపైన‌ర్ గా జూనియ‌ర్ ఎన్టీఆర్ ను దింపాల‌ని ఆ పార్టీకి చెందిన ప‌లువురు అభ్య‌ర్థులు కోరుతున్నారు. టికెట్ల కోసం అధినేత‌ను ప్ర‌స‌న్నం చేసుకున్న ప‌లువురు అభ్య‌ర్థులు ఇప్పుడు బాబు మీద తార‌క్ ను ప్ర‌చారానికి తీసుకురావాల‌న్న డిమాండ్ ను పెడుతున్న‌ట్లుగా చెబుతున్నారు. గ‌డిచిన కొంత‌కాలంగా టీడీపీకి దూరంగా తార‌క్ ఉంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న సోద‌రి సుహాసిని కుక‌ట్ ప‌ల్లి నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసినా.. తార‌క్ రియాక్ట్ కాలేదు. అంతెందుకు.. త‌న తాత ఎన్టీఆర్ బ‌యోపిక్ మీదా ఆయ‌న స్పందించింది లేదు. ఇలాంటి స‌మ‌యంలో తార‌క్ ను టీడీపీ ప్రచారం కోసం తీసుకురావాలంటూ ఏకంగా బాబు మీద ఒత్తిడి పెరుగుతున్న‌ట్లు చెబుతున్నారు. త‌మ్ముళ్ల డిమాండ్ కు బాబు స‌మాధానం చెప్ప‌లేకపోతున్న‌ట్లు తెలిసింది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విసురుతున్న స‌వాళ్ల‌కు చెక్ పెట్టేందుకు బిజీ బిజీగా ఉన్న బాబుకు. తార‌క్ ను ప్ర‌చారానికి తీసుకురావాల‌న్న డిమాండ్ కొత్త త‌ల‌నొప్పిగా మారిన‌ట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News