అబ్బాయి రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌..త‌మ్ముళ్ల గుండెల్లో రైళ్లు

Update: 2018-07-10 09:48 GMT
ఎక్క‌డైనా పార్టీ ముఖ్య‌నేత‌లు రాష్ట్ర ప‌ర్య‌ట‌న మొద‌లు పెడుతున్నారంటే చాలు పార్టీ క్యాడ‌ర్ లో ఉత్సాహం ఉర‌క‌లెత్తుతుంది. ముఖ్య‌నేత‌ల ప‌ర్య‌ట‌న‌తో పార్టీలో కొత్త ఊపు వ‌స్తుంద‌న్న ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతుంది. కానీ.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి టీడీపీలో క‌నిపిస్తోంది. తాజాగా ఏపీ ఐటీ.. పంచాయితీ రాజ్ మంత్రి.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ చేప‌డ‌తాన‌న్న ఏపీ ప‌ర్య‌ట‌న మాట విన్న‌ప్ప‌టి నుంచి తెలుగు త‌మ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఇప్ప‌టికే నాలుగేళ్ల బాబు ప‌ర్య‌ట‌న‌పై ఏపీ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. నాలుగేళ్లు కామ్ గా ఉండి.. ఇప్పుడు ఏపీ ప్ర‌త్యేక హోదా మీద గ‌ళం విప్ప‌టం మొద‌లు.. మోడీతో క‌టీఫ్ త‌ర్వాత నుంచి ఆయ‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేయ‌టం తెలిసిందే. మ‌రోవైపు విప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను అంత‌కంత‌కూ పెంచేలా చేసి.. యువ‌నేత మీద మ‌రింత ఆశ‌లు పెట్టుకునేలా చేస్తోంది.

ఇలాంటి కీల‌క వేళ రాష్ట్ర ప‌ర్య‌ట‌న చేయ‌టం ద్వారా పార్టీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతానంటూ లోకేశ్ చెబుతున్న మాట‌లు టీడీపీలో కొత్త చ‌ర్చ‌కు తెర తీశాయి. నిన్న‌టికి నిన్న‌క‌ర్నూలు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా లోకేశ్ చేసిన ప్ర‌క‌ట‌న పార్టీలో కొత్త కుమ్ములాట‌కు తెర తీయ‌ట‌మే కాదు.. రానున్న రోజుల్లో ఎలాంటి షాకింగ్ ప‌రిణామం చోటు చేసుకుంటుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

ఎన్నిక‌ల‌కు ఏడాది ముందే టికెట్ మీద హామీ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌టం ద్వారా అసంతృప్తులు మండిప‌డేలా చేయ‌ట‌మే కాదు.. ప్ర‌త్యామ్నాయాలు వెతుక్కునే అవ‌కాశం ఇచ్చిన‌ట్లైంది. రాజ‌కీయంగా లోకేశ్ లో ఎంత‌టి తొంద‌ర‌పాటు ఉంద‌న్న విష‌యం కర్నూలు ప‌ర్య‌ట‌న చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లైంది. మ‌రోవైపు ఎన్టీఆర్ ను సీఎం చేసిన ఘ‌న‌త ఇందిర‌మ్మ‌దేనంటూ అర్థం లేని రీతిలో చేసిన ప్ర‌క‌ట‌న లోకేశ్ పై ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను సుస్థిరం చేసేలా చేసింద‌ని చెప్పాలి. ఇలా సంబంధం లేకుండా మాట్లాడే మాట‌ల‌పై తెలుగు త‌మ్ముళ్లు భ‌య‌ప‌డిపోతున్నారు.

ఇప్ప‌టికే పార్టీ మీద ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌కు తోడుగా లోకేశ్ వ్యాఖ్య‌లు మ‌రెన్ని ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌న్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది.

ఇలాంటి వేళ‌.. రాష్ట్ర వ్యాప్తంగా లోకేశ్ ప‌ర్య‌టించే సంద‌ర్భంలో ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే మాట‌లు పార్టీ మీద ప్ర‌భావం చూపిస్తాయ‌ని.. అందుకే ఆయ‌న ఆచితూచి మాట్లాడాల‌ని కోరుకుంటున్నారు. ఎందుకైనా మంచిది.. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు పంపే ముందు.. బాబు త‌న‌కున్న అనుభ‌వంతో కూసిన్ని జాగ్ర‌త్త‌లు పంపితే మంచిద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News