టీడీపీలో అంతా మీడియా బేబీలే ?

Update: 2021-07-29 01:30 GMT
తెలుగుదేశం పార్టీలో ఉన్న వారు అంతా ఇపుడు బాగా రెస్ట్ తీసుకుంటున్నారు అనే చెప్పాలి. ఒక వైపు అధికారం పోయి పార్టీ కుదేల్ అయింది. రెండేళ్ళు దాటుతున్నా కూడా ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. వరస పరాజాయాలు తల బొప్పి కట్టిస్తున్నాయి. స్థానిక ఎన్నిక‌ల్లోనూ సాధార‌ణ ఎన్నిక‌ల‌ను మించిన ఘోర ప‌రాజ‌యం ఎదురైంది. ఇక తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లోనూ సేమ్ సీన్ రిపీట్‌..!  కానీ తెలుగు తమ్ముళ్లకు మాత్రం చీమ కుట్టినట్లుగా లేదు.

వారంతా తాము ఎంతసేపూ మీడియా లో ఉండడానికే ఆరాటపడుతున్నారు. టీడీపీకి ఉన్న అదృష్టం ఏంటి అంటే పెద్ద  ఎత్తున‌ మీడియా సహకారం. జగన్ కి వ్యతిరేకంగా ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా హైలెట్ చేసే మీడియా ఒకటి  ఉంది. దాంతో అంతా మీడియా మైకంలో పడిపోతున్నారు. ఎవరి మటుకు వారు తామే తోపులమని, బడా నాయకులమని కూడా ఈ మీడియా మైకంలో పడి భావిస్తున్నారే త‌ప్పా అస‌లు గ్రౌండ్ రియాల్టీ ఏంటో ఇప్ప‌ట‌కీ తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు.

అధినేత దృష్టిలో పడాలి అంటే మీడియాలో హైలెట్ అయితే చాలు అనుకుంటున్నారు. ఈ పరిణామంతో టీడీపీలో అందరూ కాళ్ళు బారజాపేశారు అనుకొవాల్సిందే. ఎవరూ కూడా గుమ్మం దాటి వెళ్లడం లేదు. ఇక కరోనా రెండు దఫాలుగా వచ్చి మరీ తమ్ముళ్లను ఇంకా ఇంటిపట్టున ఉంచేలా చేసేసింది. ఇక పార్టీ అధినేత వీళ్ల‌కు మ‌రింత కోప‌రేట్ చేసిన‌ట్టుగా జూమ్ మీటింగ్‌లు అల‌వాటు చేశారు.

దీంతో అస‌లు బ‌య‌ట‌కు వెళ్లాల్సిన బాధ‌లు త‌ప్పాయిరా బాబు అనుకుంటూ వీరు ఇంట్లో కూర్చొని రాజ‌కీయం చేసేయాల‌ని చూస్తున్నారు. అక్క‌డితో ఆగ‌కుండా ఈ సంక్లిష్ట ప‌రిస్థితి నుంచి ఎలా ?  భ‌య‌ట‌ప‌డాల‌న్న‌ది ఆలోచించ‌కుండా వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తామని అనుకూల మీడియా ముందు తెగ గొప్పలు చెబుతూంటారు. జగన్ ఇంటికి వెళ్ళడం ఖాయమని ఆర్భాటాలు చేస్తారు.

కానీ జనాలలోకి వెళ్ల‌ని టీడీపీ ఎలా గెలుస్తుంది అంటే మాత్రం సమాధానం ఉండదు. తెల్లారిలేస్తే ఏదో కొత్త పదం కనుగొనడం హైలెట్ కావాలని చూడడం తప్ప తామున్న చోట కొత్తగా నాలుగు ఓట్లు పార్టీకి సంపాదించగలిగామా అన్నదానిపై మాత్రం ఏ తమ్ముడూ ఆత్మ పరిశీలన చేసుకోవడంలేదు. డీజీపీ అన్న దానికి కూడా సరికొత్త అర్ధాలు కనుగొని మురిసిపోతున్న తమ్ముళ్ళు వచ్చే ఎన్నికల్లో కూడా ఇంతకు ఇంతా ఓటమిని కోరి తెచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నారా అనిపించకమానదు.

అస‌లు పార్టీని నిల‌బెట్టాలంటే ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి.. పోరాటాలు చేయాల‌న్న‌ది టీడీపీ నేత‌లు మ‌ర్చిపోయిన‌ట్టే ఉన్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. యధా రాజా తధా ప్రజా అన్నట్లుగా అధినాయకత్వమే ఏకంగా అనుకూల మీడియా మాయలో పడి కొట్టుకుపోతోంది. దాంతో తమ్ముళ్ళూ అంతే అనుకోవాలేమో..!
Tags:    

Similar News