డిఫెన్స్ లో బాబు.. ఆటాడుతున్న త‌మ్ముళ్లు!

Update: 2018-06-28 05:48 GMT
కొన్ని ఘ‌ట‌న‌లు అస్సలు జ‌ర‌గ‌కూడ‌దు. కానీ.. అధినేత‌లు చేసే త‌ప్పుల‌తో భారీ న‌ష్టం వాటిల్లే ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు జ‌రిగే న‌ష్టం మీద వేసే అంచ‌నాకు.. వాస్త‌వానికి మ‌ధ్య వ్య‌త్యాసం ఉండ‌టం.. ఎప్ప‌టికో కానీ ఆ న‌ష్టం విలువ అర్థం కావ‌టం.. అప్ప‌టికే జ‌ర‌గాల్సింది జ‌రిగిపోతుంటుంది. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితుల్లోనే ఉన్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.

ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు భారీ స్పంద‌న రావ‌టం.. బాబు పాల‌న‌పై వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో పార్టీలోనూ ముస‌లం మొద‌లైంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. మొన్న‌టికి మొన్న బాబుకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చే వ్యూహంలో భాగంగా ఒక స‌ర్వే విడుద‌ల కావ‌టం.. అందులో గంటా ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంద‌న్న ప్ర‌స్తావ‌న టీడీపీలో ఎలాంటి తుఫానును రేపిందో తెలిసిందే.

ప్ర‌జలు వ్య‌తిరేకంగా ఉన్నార‌న్న మాట తెలిసిన వెంట‌నే నేత‌లు అలెర్ట్ కావ‌ట‌మే కాదు.. వారి మ‌న‌సుల్ని దోచుకోవ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇందుకు భిన్నంగా గంటా వ్య‌వ‌హ‌రించ‌టం మ‌ర్చిపోకూడ‌దు. స‌ర్వే మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం.. త‌న‌పై కుట్ర ప‌న్నుతున్నారంటూ అల‌గ‌టం.. ఆయ‌న్ను బుజ్జ‌గించేందుకు బాబు ప‌డ‌రాని పాట్లు ప‌డ‌టం తెలిసిందే.

ఒక‌ప్పుడు బాబు అంటేనే భ‌య‌ప‌డే స్థానే.. ఇప్పుడు కొంద‌రు నేత‌లు బాబును త‌మ మాట‌ల‌తో భ‌య‌పెడుతున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ‌తో బెంబేలెత్తుతున్న చంద్ర‌బాబు వ‌రుస స‌మీక్ష‌ల‌తో కాలం గ‌డప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. సునిశితంగా గ‌మ‌నిస్తే.. బాబులో ఒక‌లాంటి భ‌యం చోటు చేసుకున్న ప్ర‌తిసారీ.. అలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొన‌టానికి బ‌య‌ట‌కు రాకుండా.. స‌మీక్ష‌లు.. భేటీల‌తో కాలం గ‌డిపేస్తుంటారు.

ఓటుకు నోటు వ్య‌వ‌హారం తెర మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు.. బాబు పేరును ఛార్జిషీటులో చేరుస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగిన వేళ‌.. రోజుల త‌ర‌బ‌డి అధికారుల‌తోనూ.. నేత‌ల‌తో అదే ప‌నిగా స‌మీక్ష‌లు పెట్టుకోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

తాజాగా.. జిల్లా పార్టీ నేత‌ల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయ‌ని చెబుతున్నారు. తోక జాడిస్తున్న త‌మ్ముళ్ల‌కు బాబు వార్నింగ్ ఇస్తుంటే.. రివ‌ర్స్ గేర్ లో స‌ద‌రు నేత‌లు బెదిరింపు ధోర‌ణికి దిగుతున్న‌ట్లు స‌మాచారం. అవినీతి ఎక్కువ‌గా ఉందంటూ సీమ‌కు చెందిన ఒక నేత‌కు క్లాస్ పీకేందుకు సిద్ధ‌మ‌వుతున్న బాబుకు స‌ద‌రు నేత ఊహించ‌ని రీతిలో షాకిచ్చార‌ట‌. సార్.. నా మాట‌ను కాస్త వినండి. నేను చెప్పింది విన్నాక.. త‌ప్పైతే మీరు ఏమంటే దానికి సిద్ధం. మీరు నా అవినీతి గురించి చెప్పాల‌నుకుంటున్నారు. నేను గ‌డిచిన నాలుగేళ్ల‌లో సంపాదించింది ఇంత‌. 2014 ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేసింది ఇంత‌. పార్టీ కోసం.. పార్టీ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల కోసం ఖ‌ర్చు చేస్తున్న‌ది ఇంత‌. వ‌చ్చే ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం రిజ‌ర్వ్ చేసిన మొత్తం ఇంత‌. ఇవ‌న్నీ పోను మిగిలింది ఇంత మొత్తం అంటూ గుక్క తిప్పుకోకుండా లెక్క చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌న సంపాద‌న మొత్తం లెక్క చెప్పాన‌ని..  తాను చెప్పింది నిజ‌మో కాదో నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారం తెప్పించుకోవాలంటూ బాబుకు ఎదురు క్లాస్ పీకార‌ట స‌ద‌రు సీమ త‌మ్ముడు. ఇలా అధినేత‌తోనే తాను చేసిన అవినీతి గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడ‌టం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలో బాబు ఏదైనా చెబితే.. ఎదురు స‌మాధానం చెప్పే వారు కాద‌ని.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. జ‌గ‌న్ కు పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ నేప‌థ్యంలో మునిగే ప‌డ‌వ‌లో ఉండే క‌న్నా.. కాదూ కూడ‌దంటే పార్టీ మారేందుకు సైతం కొంద‌రు త‌మ్ముళ్లు సిద్ధంగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదెంత‌వ‌ర‌కూ నిజ‌మ‌న్న‌ది రానున్న రోజులు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News