బాల‌య్య ఇలాకాలో త‌మ్ముళ్ల కొత్త పంచాయ‌తీ

Update: 2017-07-11 13:11 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బావ‌మ‌రిది నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. కొద్దికాలం క్రితం బాల‌య్య పీఏ ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన హిందూపురం - అనంత‌రం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ ప‌రిష్క‌రించ‌డంలేద‌ని వినూత్న రీతిలో నిర‌స‌న‌ల తెల‌ప‌డం ద్వారా అంద‌రి చూపును త‌న‌వైపు తిప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిస్థితులు స‌ద్ధుమ‌ణుగుతున్న క్ర‌మంలో కొత్త డిమాండ్ బాల‌య్య ఇలాకా నుంచి వినిపిస్తోంది. సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌ లో ఉన్న నామినేటెడ్ పదవులను ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవడంతో నేతల్లో ఆశలు చిగురించాయి. ఈ క్ర‌మంలోనే కొత్త డిమాండ్లు సైతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టి కొలువుల భ‌ర్తీలో రాష్ట్ర మాంస ఉత్పత్తి అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌ గా అనంత‌పురం జిల్లాకు చెందిన చంద్రదండు నేత ప్రకాశ్‌ నాయుడికి అవకాశం దక్కింది.మరో రెండు - మూడు రోజుల్లో మిగిలిన నామినేటెడ్ పదవులు తదితర ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేసే అవకాశాలు ఉండటంతో ఆయా పదవుల కోసం వివిధ వర్గాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం - హిందూపురం అర్బన్ డెవలప్‌ మెంట్ అథారిటీ (అహుడా) ఛైర్మన్ పదవి కోసం కొందరు ముఖ్య నేతలు కూడా ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు.  ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ - అహుడా - స్ర్తి - శిశు సంక్షేమ శాఖ వంటి నామినేటెడ్ పదవులు పెండింగ్‌ లో ఉన్నాయి. దీంతో వారంతా త‌మ త‌మ ప‌రిచ‌యాల‌ను బ‌ట్టి ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ను - సీఎం చంద్ర‌బాబు - యువ‌నేత లోకేష్‌ ను సైతం క‌లుస్తున్నారు.

ఇదిలా ఉండగా పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఆయ‌న్ను ఇర‌కాటంలో ప‌డేయ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు. చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టిన సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో వడ్డెర్ల సంఘం ప్రతినిధులు ఆయన్ను కలిసి మద్దతు పలికారు. ఇప్పటి వరకు తమకు పార్టీలో అంతగా ప్రాధాన్యత లభించలేదని విన్నవించగా అధికారంలోకి వస్తే తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాకు చెందిన వడ్డెర్ల సంఘం సీనియ‌ర్‌ నేతలు ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌లు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ - మంత్రి నారా లోకేష్‌ లను కలుస్తున్నారు. దశాబ్ధాల కాలంగా పార్టీ కోసం పనిచేసి ఆర్థికంగా నష్టపోయానని వారు విన్నవించగా తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని స‌మాచారం. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పదవులు భర్తీ చేస్తుండగా వడ్డెర్ల సంఘం నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా జిల్లాలో వడ్డెర్ల కులస్తులు తెలుగుదేశం పార్టీకి అనాదిగా వెన్నుదన్నుగా ఉంటున్నారు. హిందూపురం - పుట్టపర్తి - కదిరి - పెనుకొండ నియోజకవర్గాల్లో వడ్డెర్ల ఓటుబ్యాంక్ ఉంది. చంద్రబాబు ఇచ్చిన భరోసా మేరకు తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో వడ్డెర్ల సంఘం టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. కాగా, బాల‌య్య ఇలాక‌లో మొద‌లైన ప‌ద‌వుల డిమాండ్ పార్టీ అధిష్టానం ఎలా ప‌రిష్క‌రిస్తుంద‌నే చ‌ర్చ అంద‌రిలోనూ మొద‌లైంది.
Tags:    

Similar News