టీడీపీలో తెల్ల ఏనుగులు.. ఇలా ఎన్నాళ్లు..?

Update: 2022-07-12 00:30 GMT
అధికారం ఉన్న‌ప్పుడు.. అంతా మాదేన‌ని అనుభ‌వించారు. ఎక్క‌డా ఎవ‌రిని ఎద‌గ‌కుండా కూడా చ‌క్రాలు తిప్పారు. నియోజ‌క‌వ‌ర్గాల్లోను.. జిల్లాల్లోను కూడా.. నాయ‌కులు త‌మ‌దైన శైలిలో దూసుకుపోయారు. మంచిదే..ఇది పార్టీకి ప్ర‌యోజ‌నం అనుకున్నారో.. లేక అంతో ఇంతో.. పార్టీకి బ‌లంగా ఉన్న నాయ‌కులు కావాల‌ని.. భావించారో తెలియ‌దు కానీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాత్రం.. ఇలాంటి వారిని చూసీ చూడ‌న‌ట్టు పోయారు. దీంతో వారు అప్ప‌ట్లో చెల‌రేగిపోయారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి ఏంటి? అంటే.. మూడేళ్లుగా.. చంద్ర‌బాబు, లోకేష్ లేదా.. ఒక‌రిద్ద‌రు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, య‌న‌మ‌ల రామకృష్ణుడు, లేదా మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. వారి స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్నారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కానీ, గ‌తంలో ప‌ద‌వులు అనుభవించిన నాయ‌కులు, మాజీ మంత్రులు మాత్రం ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

వాస్త‌వానికి ఇప్పుడే కాదు.. గ‌త మూడేళ్లుగా కూడా వారి ప‌రిస్థితి అలానే ఉంది. అయితే.. ఇప్పుడు మాత్ర‌మే ఈ చ‌ర్చ ఎందుకు వ‌చ్చిందంటే.. తాజాగా టీడీపీలో ఒక విష‌యంపై చ‌ర్చ సాగింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ని ముందుకు న‌డిపించేందుకు ఎలాంటి వ్యూహాలు వేయాల‌నే అంశంపై తాజాగా చంద్ర‌బాబు సీనియ‌ర్ల తో చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో ప‌నిచేయ‌డం లేదంటూ.. కొంద‌రిపైనా.. అస‌లు ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ‌మే చూపించ‌లేదంటూ.. మ‌రికొంద‌రిపైనా.. ఫిర్యాదులు అందాయి.

వీరిలో ఎప్పుడూ చెప్పుకొనే నాయ‌కులైన గంటా శ్రీనివాస‌రావు.. త‌దిత‌రులు ఉన్నారు. ఇప్పుడు వీరితో పాటు.. మ‌రికొంద‌రి పేర్లు కూడా చంద్ర‌బాబుకు అందాయి. చిత్రం ఏంటంటే వీరిలో కొంద‌రు వార‌సులు కూడా ఉన్నారు.

వచ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు కూడా ఆశిస్తున్నారు. అయితే.. వీరెవ‌రూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ డం లేదు. దీంతో ఇలాంటి వారిని ఏం చేయాల‌నే అంశంపై చంద్ర‌బాబు మ‌థ‌న ప‌డుతున్నార‌ని స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News