లీకుల‌తో ఎంపీల మైండ్‌ బ్లాంక్ చేస్తున్న బాబు

Update: 2018-10-03 12:51 GMT
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌ల్లో పెట్టిన పాత ఫార్ములా ఆ పార్టీకి చెందిన‌ ఎంపీల్లో క‌ల‌వ‌రం సృష్టిస్తోంద‌ట‌. రాజ‌కీయ వ్యూహాల్లో ఆరితేరిన చంద్ర‌బాబు ఆ ఎత్తుగ‌డ‌లు తాజాగా పార్టీ నేత‌ల‌పైనే అమ‌లు చేస్తుండ‌టంతో...ఏం జ‌ర‌గ‌నుంద‌ని ఎంపీలంతా మ‌థ‌న ప‌డుతున్నార‌ని అంటున్నారు. ఈ క‌ల‌వ‌ర‌పాటుకు కార‌ణం రాబోయే ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటు స్థానాల‌కు బ‌రిలో దిగే అభ్య‌ర్థుల‌కు టికెట్లు కేటాయింపు గురించి త‌న ఆస్థాన మీడియాలో ప్ర‌చారం చేయ‌డం గురించి. తాము ఊహిస్తుంది ఒక‌టైతే...పార్టీ పెద్ద‌లు ఇస్తున్న లీకుల ప‌ర్వం మరొక‌టి అని కొంద‌రు నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే...తెలుగుదేశం అనుకూల మీడియాగా పేరొందిన రెండు ప‌త్రిక‌ల్లో రాబోయే ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటు స్థానాల త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌బోయే వారిలో వీరికి టికెట్లు ప‌క్కా..వీరికి డౌట్ అంటూ క‌థ‌నాలు ప్ర‌చురితం అయ్యాయి. పత్రికలు  అన్న త‌ర్వాత క‌థ‌నాలు రావ‌డం స‌హ‌జమే అయితే, బాబుకు ఆలోచ‌న‌కు అనుగుణంగానే వార్తలు వ‌స్తాయ‌నే పేరున్న స‌ద‌రు ప‌త్రిక‌ల్లో దాదాపు ఒకే త‌ర‌హా విశ్లేష‌ణ‌తో అంచ‌నాలు రావ‌డం, ఈ రెంటి వెనుక టీడీపీ పెద్ద‌లున్నార‌నే భావ‌న‌కు బ‌లం చేకూర్చింది. ఇంత‌కీ ఆ క‌థ‌నంలో ఏముంద‌య్యా అంటే... పార్టీ ఎంపీలు అశోక్ గజపతి రాజు - మురళీ మోహన్ - రవీంద్రబాబు - కేశినేని నాని - మాగంటి బాబు - కొనకళ్ల నారాయణ - రామ్మోహన్ నాయుడు - గల్లా జయదేవ్ - శ్రీరాం మాల్యాద్రి - శివప్రసాద్ - నిమ్మల - బుట్టారేణుకకు రాబోయే ఎన్నిక‌ల్లో టికెట్లు ఖాయ‌మ‌ట‌. 12 మంది సిట్టింగులకు టికెట్లు ఖాయమే అని.. మిగిలిన వారిలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని తెలుగుదేశం అధికారిక మీడియా వర్గాలు నిర్ధారిస్తున్నాయి.  అయితే ఈ క‌థ‌నంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే...క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు - స‌ద‌రు నాయ‌కుల ఆలోచ‌న తీరు భిన్నంగా ఉండ‌టం వ‌ల్ల ఈ టికెట్ల లెక్క తుప్పుతుంద‌ని అంటున్నారు.

బాబుకు స‌న్నిహితుడ‌నే పేరున్న ఎంపీ మురళీ మోహన్‌ కు టికెట్ ఖాయ‌మ‌ని అంటున్న‌ప్ప‌టికీ...ఆయ‌న త‌న కోడలికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నార‌నే టాక్ ఉంది. ముఖ్య‌మంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరుకు చెందిన ఎంపీ శివ‌ప్ర‌సాద్‌ కు వివిధ కార‌ణాల వ‌ల్ల టికెట్ క‌ష్ట‌మంటున్నారు. ఇక కీల‌క నియోజ‌క‌వ‌ర్గ‌మైన హిందూపురం విష‌యంలో ఓవైపు ప‌రిటాల శ్రీ‌రామ్ ప్ర‌య‌త్నం చేస్తుంటే..మ‌రోవైపు నిమ్మ‌ల ఎమ్మెల్యే గిరిపై ఆశ‌లు పెంచుకున్నారు. అయిన‌ప్ప‌టికీ నిమ్మంల‌కే టికెట్ అన‌డం ఆస‌క్తిక‌రంగా ఉందంటున్నారు. జంపింగ్ ఎంపీ అయిన బుట్టా రేణుక‌కు టికెట్ విష‌యంలో కూడా భ‌రోసా ఇవ్వ‌డం క‌ర్నూలులో రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌నే టాక్ ఉంది. ఇలా వివిధ ర‌కాలైన వాస్త‌విక స్థితిగ‌తులు ఉన్న నేప‌థ్యంలో ఈ టికెట్ల లీకేజీ వెనుక టీడీపీ పెద్ద‌ల స్కెచ్చేంటి అనేది అంతుచిక్క‌డం లేదు.
Tags:    

Similar News