పార్టీ నేత‌ల‌నే క‌ల‌వ‌ని ప‌వ‌న్ మా ఎమ్మెల్యేల‌కు ట‌చ్‌ లోకి వ‌స్తాడా?

Update: 2018-03-22 12:47 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై అధికార తెలుగుదేశం పార్టీ విరుచుకుప‌డుతోంది. త‌మ నాయ‌కుడితో 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ట‌చ్‌ లో ఉన్నార‌ని జ‌న‌సేన పార్టీ నేత‌లు ప్ర‌క‌టించిన తీరుపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఆక్షేపించారు. జనసేన నాయకులకే టచ్‌ లో లేనటువంటి నాయకుడు పవన్ క‌ళ్యాణ్ అని పేర్కొంటూ అలాంటి వ్య‌క్తి మా 40 మంది  ఎమ్మెల్యేలుతో ఎలా టచ్‌ లో ఉంటారని ఎద్దేవా చేశారు.  అవగాహన రాహిత్యంగా పవన్ మాటలు ఉన్నాయని - పవన్ తీసుకున్న యూటర్న్ ప్రజలు గమనిస్తున్నారని బోండా మండిప‌డ్డారు.

ఆనాడు పట్టిసీమ సూపర్ అని బీజేపీ నాయకులు పొగిడారని, నేడు ఎందుకు ఈ విమర్శలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని బోండా ఉమా అన్నారు. అమరావతి నిర్మాణం ఆపాలని - పోలవరం నిర్మాణం జరగకూడదని బీజేపీ చూస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అవిశ్వాసం మీద చర్చ జరగాలని, చర్చ జరిగితేనే ఎవరిది తప్పు అన్ని ప్రజలందరికి తెలుస్తుందన్నారు. బీజేపీ ఏపీలో ఎమర్జెన్సీ వాతవరణం కల్పించాలని చూస్తుందని ఆయన చెప్పారు. అవిశ్వాసం పెట్టినంత మాత్రాన.. పోలవరం లాంటి ప్రాజెక్ట్ నిధులు ఆపడం కేంద్రం వల్ల కాదని, నిబంధనలకు అనుగుణంగానే.. కేంద్రం నుండి నిధులు వస్తాయని తెలిపారు. పోలవరం పనులు కేంద్రం కనుసన్నల్లోనే జరుగుతుంటే, ఇంకా ఏ విచారణ చేపడతారని ఎద్దేవా చేశారు.

ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయడ‌మే కాకుండా రాజకీయంగా తమను నష్టపర్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. తమ ప్రభుత్వంపై ఏ విచారణ చేసినా తమకు ఇబ్బందులు లేవని  తెలిపారు. తమ ప్రభుత్వంపై ఎన్ని సీబీఐ విచారణలు చేయించినా తమకు నష్టం లేదని ఆయన చెప్పారు. ఈ సంద‌ర్భంగా పరోక్షంగా వైసీపీ నేత వైఎస్ జగన్‌‌ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Tags:    

Similar News